Stray dogs: వీధి కుక్కలకు రాజభోగం.. మహారాష్ట్రలో 'శునకాల ఆశ్రమం'!
- కుర్చీలు, బెడ్స్ పైనా ఆశ్రమంలో ఎక్కడ చూసినా అవే..
- రోజూ తిండి కోసం 50 కిలోల గోధుమ పిండితో రొట్టెలు
- ఆశ్రమంలోని శునకాలతో పాటు వీధి కుక్కలకూ ఆహారం
మూగ జీవాలకు సేవ చేయడమంటే భగవంతుడిని సేవించడమేనని చిత్తశుద్ధితో నమ్మే ఆశ్రమమది.. ప్రత్యేకంగా వీధి కుక్కల కోసం ఏర్పాటు చేసి, దశాబ్దాలుగా వాటికి రోజూ తిండి పెడుతూ వస్తోంది. ఆశ్రమంలో శునకాలకు ప్రవేశంలేని ప్రదేశమే లేదు. పూజా మందిరం సహా అవి ఎక్కడ కూచున్నా, దేనిపై పడుకున్నా అదిలించే ప్రసక్తే లేదు. ఒకరకంగా ఇక్కడ వీధి కుక్కలు రాజభోగాలు అనుభవిస్తున్నాయి. ఏళ్ల తరబడి పదులు, వందల సంఖ్యలో శునకాలు ఉంటున్నా ఏనాడూ ఆశ్రమంలో ఎవరినీ కరిచిన సందర్భాలే లేవని నిర్వాహకులు వెల్లడించారు. నాగ్ పూర్ లోని ఈ ఆశ్రమం పేరు ‘కుత్తే వాలా బాబాకి ఆశ్రమ్’.
రోజుకు 50 కిలోల పిండితో రొట్టెల తయారీ..
పెంపుడు కుక్కలను ముద్దు చేయడం, వాటికి ప్రత్యేకంగా సదుపాయాలు కల్పించడం చాలా ఇళ్లల్లో సాధారణమే.. కానీ ఈ ఆశ్రమం వీధి కుక్కలకు ప్రత్యేకం. పెంపుడు జంతువులను ఇకపై పోషించలేమని తీసుకొచ్చినా ఆశ్రమంలో చేర్చుకుంటారు. ఇప్పుడు ఆశ్రమంలో 60 శునకాలు ఉన్నాయని ఆశ్రమం ట్రస్టీ ఆశిష్ వర్మ చెప్పారు. వీటికి తిండి కోసం రోజుకు 50 కిలోల గోధుమ పిండితో రొట్టెలు తయారు చేస్తామని వివరించారు. ఆ రొట్టెలను పాలల్లో నానబెట్టి శునకాలకు పెడతామని చెప్పారు. ఆశ్రమం లోపలి శునకాలతో పాటు వీధి కుక్కల కోసం వలంటీర్లు ఈ రొట్టెలు తీసుకెళతారని వర్మ వివరించారు.
ఆశ్రమం ఎలా మొదలైందంటే..
వీధికుక్కలకు తిండి పెట్టడం తమ గురువుగారు పరమహంస రామ్ సంబర్ బాబా నుంచి మొదలైందని ట్రస్టీలలో ఒకరైన జైకుమార్ చెప్పారు. వందేళ్ల క్రితం నాగ్ పూర్ లోని శాంతి నగర్ ఏరియాలో ఈ ఆశ్రమాన్ని చిన్నగా ఏర్పాటు చేశారని ఆయన వివరించారు. మనుషులకు ఆకలేస్తే నోటితో అడుక్కుంటారు.. కానీ మూగ జీవాల పరిస్థితి ఏంటని బాబా ప్రశ్నించేవారట. మూగ జీవాలకు సేవ సాక్షాత్తూ భగవంతుడి సేవేనని చెప్పేవారట. అప్పటి నుంచి ఆశ్రమంలో శునకాలు ఉంటున్నాయని జైకుమార్ చెప్పారు. 1967లో బాబా ఆశ్రమంలోనే జీవసమాధి పొందారని వివరించారు. ఆశ్రమంలో శునకాలకు నిషిద్ధమైన ప్రదేశం ఏదీలేదని వివరించారు. ఆశ్రమానికి వచ్చే భక్తులు కూడా శునకాలను అదిలించడం వంటి పనులు చేయరన్నారు. వందేళ్లకు పైగా నిర్వహిస్తున్నా ఈ ఆశ్రమంలో ఏనాడూ కుక్కకాటు సంఘటనలు చోటుచేసుకోలేదన్నారు.