Russia: పవర్ గ్రిడ్లపై రష్యా దాడులు.. అంధకారంలో 40 లక్షల మంది ఉక్రెయిన్ ప్రజలు
- ఈ నెల 10 నుంచి విద్యుత్ వ్యవస్థలపై రష్యా దాడులు
- దేశంలో 30 శాతం పవర్ గ్రిడ్లను ధ్వంసం చేసిన వైనం
- 40 లక్షల మంది ప్రజలు ప్రభావితం అయినట్టు ఉక్రెయిన్ వెల్లడి
ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధం సుదీర్ఘ కాలంగా కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజులగా ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని రష్యా వైమానిక దళాలు దాడులు చేస్తున్నాయి. దాంతో, ఉక్రెయిన్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దేశంలో అంధకారం నెలకొంది. ఉక్రెయిన్ లో దాదాపు 40 లక్షల మంది విద్యుత్ లేక చీకట్లలో బతుకున్నారు. శీతాకాలం సమీపిస్తుండటంతో ఉక్రెయిన్ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
ఉక్రెయిన్ పవర్ గ్రిడ్‌పై గత రెండు వారాలుగా రష్యా క్షిపణి, డ్రోన్ దాడులు చేస్తోంది. ఫలితంగా ఆ దేశంలోని విద్యుత్ సౌకర్యాలలో కనీసం మూడో వంతు నాశనం అయ్యాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా దళాలు పవర్ గ్రిడ్‌లను పడగొట్టిన తర్వాత ఉక్రెయిన్ అంతటా 40 లక్షల మంది ప్రజలు విద్యుత్ కోతలతో బాధపడుతున్నారని అన్నారు.
రాజధాని కీవ్‌లో, పవర్ గ్రిడ్ ఎమర్జెన్సీ మోడ్ లో పనిచేస్తోంది. యుద్ధానికి ముందు స్థాయుల కంటే 50% వరకు విద్యుత్ సరఫరా తగ్గింది. దీనివల్ల శీతాకాలం కంటే ముందే రోజుకు నాలుగు గంటలు అంతకంటే ఎక్కువ సమయం విద్యుత్ కోతలు విధించాల్సి వస్తోంది. విద్యుత్ వ్యవస్థలు లక్ష్యంగా అక్టోబరు 10న దాడులను ప్రారంభించినప్పటి నుంచి ఉక్రెయిన్ లో 30 శాతం పవర్ స్టేషన్లు ధ్వంసమయ్యాయి. మరోవైపు ఉక్రెయిన్‌లో పోరాడటానికి మూడు లక్షల మంది రిజర్వ్ సైనికులను తమ దళాల్లో చేరుస్తున్న కార్యక్రమాన్ని రష్యా ముగించింది. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ప్రకారం ఇప్పటికే 41 వేల మంది రిజర్వ్ సైనికులను యుద్ధభూమిలో మోహరించారు.