Kanipakam: కాణిపాకం ఆలయంలో విలువైన నగ మిస్సింగ్!
- మిస్సయ్యిందా.. మాయం చేశారా?
- బంగారు విభూది పట్టిని స్వామికి అందజేసిన దాత
- గతంలో పలు సందర్భాల్లో స్వామివారికి అలంకరణ
- రసీదు ఇవ్వాలని కోరగా మిస్సింగ్ విషయం వెలుగులోకి
కాణిపాకం ఆలయంలో విలువైన నగ ఒకటి మాయమవడం సంచలనంగా మారింది. స్వామి వారికి భక్తితో దాత అందజేసిన విభూది పట్టీ కనిపించడంలేదని సమాచారం. దీంతో సదరు దాత ఈ విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆపై దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ దృష్టికి వెళ్లడంతో.. సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
వేలూరు గోల్డెన్ టెంపుల్ కు చెందిన నారాయణ శక్తి అమ్మణ్ వరసిద్ధి వినాయకుడికి బంగారు విభూది పట్టీని సమర్పించుకున్నారు. మహాకుంభాభిషేకంలో పాల్గొని ఈ కానుక సమర్పించారు. ఈ నగ విలువ సుమారు రూ.18 లక్షలు ఉంటుందని సమాచారం. అయితే, దీనికి సంబంధించి ఆలయ అధికారులు ఎలాంటి రసీదు ఇవ్వలేదు. తర్వాత ఇస్తామని చెప్పారని దాత వివరించారు.
ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా ఆగస్టు 27న నిర్వహించిన మహా కుంభాభిషేకంలో స్వామి వారికి ఈ నగను అలంకరించారు. తర్వాత బ్రహ్మోత్సవాలలోనూ ఉపయోగించారు. ఈ క్రమంలో రసీదు కోసం మరోసారి ఆలయ అధికారులను ఆశ్రయించగా.. నగ కనిపించట్లేదనే విషయం బయటపడిందని దాత చెప్పారు. ఆలయ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బంగారు విభూది పట్టీ మాయమైందని మంత్రులకు దాత ఫిర్యాదు చేశారు.