TRS: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాల కేసు.. నిందితుల రిమాండ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- నలుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు యత్నించారనే కేసు
- నిందితుల రిమాండ్ కు అంగీకరించని ఏసీబీ కోర్టు
- హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేసిన పోలీసులు
- రిమాండ్ కు అనుమతించిన హైకోర్టు
- నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని ఆదేశం
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించారనే కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురుని రిమాండ్ కు తరలించేందుకు హైకోర్టు అనుమతిస్తూ, ఏసీబీ కోర్టు రిమాండ్ రిజెక్ట్ ను కొట్టివేసింది. పోలీసులు వేసిన రివిజన్ పిటిషన్ ను అనుమతించింది. ప్రస్తుతం బయట ఉన్న నిందితులు వెంటనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
ఈ క్రమంలో నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మరోవైపు నిన్న పోలీసుల పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు... నిందితులు హైదరాబాద్ ను విడిచి వెళ్లొద్దని షరతు విధించిన సంగతి తెలిసిందే. పిటిషన్ పై విచారణను ఈరోజుకు వాయిదా వేసింది. ఈ విచారణ సందర్భంగా నిందితులను రిమాండ్ కు అనుమతించింది. నిందితులను అదుపులోకి తీసుకుని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని హైకోర్టు ఆదేశించింది.