Cricket: కోహ్లీ అవుతానంటూ.. ప్రొఫెషనల్ క్రికెటర్లా షాట్లు కొడుతున్న లడఖ్ బాలిక.. వీడియో వైరల్
- పాఠశాల మైదానంలో తోటి విద్యార్థులతో క్రికెట్ ఆడిన ఆరో తరగతి బాలిక మక్సూమా
- వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన లడఖ్ విద్యాశాఖ డైరెక్టర్
- విరాట్ కోహ్లీ మాదిరి పెద్ద క్రికెటర్ నవుతానని చెప్పిన మక్సూమా
పచ్చదనం ఉట్టిపడే లడఖ్ అందమైన ప్రాంతం. కానీ, ఉగ్రముప్పు, ఇతర భద్రతా సమస్యల కారణంగా ఆ ప్రాంతంలోని ప్రజలు కొన్ని సార్లు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతారు. ఆట, పాటలు కూడా తక్కువే. అయితే, లడఖ్‌కు చెందిన ఓ బాలిక క్రికెట్ ఆడుతున్న వీడియో ఇప్పుడు నెట్లో వైరల్ అవుతోంది. మక్సూమా అనే ఆరో తరగతి బాలిక తన ఈడు పిల్లలతో ఆడుకుంటూ అచ్చం ప్రొఫెషనల్ క్రికెటర్ ను తలపించేలా ముచ్చటైన షాట్లు కొడుతోంది. ఆమె బ్యాటింగ్ చేస్తున్న వీడియోను లడఖ్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
దీనికి ఇప్పటికే 3 లక్షలకు పైగా వీక్షణలు లభించాయి. వీడియోలో మక్సూమా తన తోటి విద్యార్థులతో ఉత్సాహంగా క్రికెట్ ఆడుతూ కనిపించింది. ఆమె బ్యాటింగ్ చేసే విధానం ఆకట్టుకునేలా ఉంది. కొన్ని బంతులను ఆమె పాఠశాల మైదానం వెలుపలకు కూడా కొట్టింది. నీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఎవరు? అని అడగ్గా.. విరాట్ కోహ్లీ అని వెల్లడించింది. మాజీ క్రికెటర్ ధోనీ కొట్టే హెలికాప్టర్ షాట్ నేర్చుకోవాలనుకుంటున్నట్లు మక్సూమా చెప్పింది. విరాట్ కోహ్లీ మాదిరిగా పెద్ద క్రికెటర్ అవ్వాలనుకుంటున్నట్టు తెలిపింది.
‘ఇంట్లో మా నాన్న, స్కూల్లో మా టీచర్ నన్ను క్రికెట్ ఆడమని ప్రోత్సహిస్తున్నారు. కోహ్లీలా ఆడేందుకు ప్రయత్నిస్తా’ అని మక్సూమా పేర్కొంది. ఈ వీడియోలో మక్సూమా ప్రతిభను చూసి పలువురు ఫిదా అయ్యారు. ఆమె నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు. మున్ముందు ఆమె జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.