Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ చూస్తే దేవుడు పాట పాడినంత మధురంగా అనిపించింది: గ్రెగ్ చాపెల్
- పాకిస్థాన్ పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ
- కోహ్లీ బ్యాటింగ్ కు ముగ్ధుడైన గ్రెగ్ చాపెల్
- నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోశాడని కామెంట్
- భారత క్రికెట్లో అత్యంత సంపూర్ణ బ్యాట్స్ మన్ అని కితాబు
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రదర్శన మాజీ క్రికెటర్లను కూడా విశేషంగా ఆకట్టుకుంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం గ్రెగ్ చాపెల్ (74) కూడా కోహ్లీ ఆటకు ఫిదా అయ్యారు.
పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ బ్యాటింగ్ చూస్తే దేవుడు పాట పాడినంత మధురంగా అనిపించిందని చాపెల్ కొనియాడారు. ఓ పిల్లి పిల్లకు కొత్త ఉన్ని దారపు ఉండ దొరికితే ఎంత సంబరంగా ఆడుకుంటుందో, కోహ్లీ పాకిస్థాన్ బౌలింగ్ ను అదేవిధంగా ఆడుకున్నాడని వ్యాఖ్యానించారు. ఎంతో నైపుణ్యం ఉన్న పాక్ బౌలింగ్ లైనప్ ను కవ్విస్తూ సాగిన కోహ్లీ బ్యాటింగ్ మెల్బోర్న్ మైదానంలో అందంగా ఆవిష్కృతమైందని అభివర్ణించారు.
ప్రత్యర్థి బౌలింగ్ దాడులను ఇంత నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోసిన ఆటగాడు మునుపటి తరంలోనూ ఎవరూ లేరని పేర్కొన్నారు. తనకు తెలిసినంత వరకు కోహ్లీ భారత క్రికెట్లో అత్యంత పరిపూర్ణమైన ఆటగాడని కితాబునిచ్చారు.
గొప్ప చాంపియన్లు అనదగ్గ ఆటగాళ్లు మాత్రమే కోహ్లీలాగా తెగువను, యుక్తిని కలగలిపి ఆడగలరని చాపెల్ వివరించారు. పాతతరం ఆటగాడైన టైగర్ పటౌడీ ఈ విషయంలో కోహ్లీకి దరిదాపుల్లోకి వస్తాడని అభిప్రాయపడ్డారు. 'ద సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్' పత్రికకు రాసిన వ్యాసంలో గ్రెగ్ చాపెల్ ఈ మేరకు పేర్కొన్నారు.