Boycott Cadbury: ట్విటర్ లో ‘బాయ్ కాట్ క్యాడ్బరీ’ ఉద్యమం.. దీపావళి ప్రకటనపై వివాదం

Boycott Cadbury trending as Twitter users claim ad has link with PM Modi

  • టీవీ ప్రకటనలో ప్రధాని మోదీ తండ్రి దామోదర్ పేరు వినియోగం
  • వీధి వ్యాపారికి ఈ పేరుతో ప్రకటన రూపొందించిన క్యాడ్బరీ
  • అభ్యంతరం వ్యక్తం చేసిన విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచి

క్యాడ్బరీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. ట్విట్టర్ లో 'బాయ్ కాట్ క్యాడ్బరీ' ఉద్యమాన్ని కొందరు యూజర్లు లేవనెత్తారు. ఈ విడత దీపావళి పండుగ సందర్భంగా క్యాడ్బరీ సంస్థ రూపొందించిన వీడియో ప్రకటన వివాదానికి దారి తీసింది.  

దీపావళి సందర్భంగా క్యాడ్బరీ ఇచ్చిన ప్రకటనలో.. ప్రధాని మోదీ తండ్రి పేరు ‘దామోదర్’ను ఉపయోగించడం తాజా వివాదానికి కారణమైంది. ఈ వీడియో ప్రకటనలో ఓ వృద్ధుడు తోపుడు బండిపై ప్రమిదెలను విక్రయిస్తుంటాడు. అతడి పేరు దామోదర్. అతడిని వెతుక్కుంటూ ఓ సూట్ ధరించిన వ్యక్తి వచ్చి, గిఫ్ట్ గా క్యాడ్బరీ చాక్లెట్ల ప్యాక్ ను అందజేస్తాడు. 

దీనిపై విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచి సీరియస్ గా స్పందించారు. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రకటనలో ప్రధాని మోదీ తండ్రి పేరును ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘టీవీ చానల్స్ లో క్యాడ్బరీ చాక్లెట్స్ ప్రకటనను మీరు జాగ్రత్తగా పరిశీలించారా? షాపు లేని ఓ నిరు పేద ల్యాంప్ విక్రేత పేరు దామోదర్. ప్రధాని నరేంద్ర మోదీ తండ్రి పేరును తక్కువ చేయడానికి చేసిన ప్రయత్నం ఇది. క్యాడ్బరీ కంపెనీ సిగ్గు పడాలి. బాయ్ కాట్ క్యాడ్బరీ’’అంటూ సాధ్వి ప్రాచి సీరియస్ పోస్ట్ పెట్టారు. దీనిపై ట్విట్టర్ లో పెద్ద ఎత్తున స్పందనే వస్తోంది.

బ్రిటన్ కు చెందిన మోండెలెజ్ ఇంటర్నేషనల్ క్యాడ్ బరీ మాతృసంస్థ. దేశీ చాక్లెట్ల మార్కెట్లో ఈ సంస్థకు పెద్ద మొత్తంలో వాటా ఉంది. క్యాడ్బరీ సంస్థ వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. చాక్లెట్ల తయారీలో గొడ్డు మాంసం వినియోగిస్తున్నారంటూ 2021లో ఆరోపణలు ఎదుర్కొన్నది. అప్పుడు తాము భారత్ లో తయారు చేస్తున్నవన్నీ నూరు శాతం శాకాహార ఉత్పత్తులేనని మోండెలెజ్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. 

 కానీ, ఇక్కడ వాస్తవాలు కూడా చెప్పుకోవాలి. ‘‘దయ చేసి తెలుసుకోండి. మా ఉత్పత్తుల ఇంగ్రేడియెంట్స్ లో జిలెటిన్ ఉంటే అది హలాల్ ధ్రువీకరణ పొందినది. దీన్ని గొడ్డు మాంసం నుంచి తయారు చేశాం’’అంటూ క్యాడ్బరీ స్వయంగా చేసిన ప్రకటనను పరిశీలించాల్సిందే. హలాల్ సర్టిఫికేషన్ అన్నది ఇస్లామిక్ కౌన్సిల్ ఏర్పాటు చేసుకున్న నాణ్యత, తయారీ ప్రమాణాలను నిర్ధారించేది. అంటే గల్ఫ్ దేశాల్లో క్యాడ్బరీ చాక్లెట్లలో గొడ్డు మాంసం వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. తాజా టీవీ ప్రకటన నేపథ్యంలో ఇది కూడా మరోసారి సామాజిక మాధ్యమాల్లో చర్చకు వచ్చింది.

  • Loading...

More Telugu News