Somu Veerraju: విశాఖ భూ దందాలపై వైసీపీ, టీడీపీ కుమ్మక్కయ్యాయి: సోము వీర్రాజు
- విశాఖలో మీడియాతో మాట్లాడిన సోము, జీవీఎల్
- విశాఖ భూ దందాలపై గతంలో సిట్ వేశారన్న సోము
- సిట్ నివేదికలను టీడీపీ, వైసీపీ బహిర్గతం చేయలేదని ఆరోపణ
- విశాఖ భూ దందాల్లో టీడీపీ, వైసీపీ పాత్ర ఉందన్న జీవీఎల్
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖలో మీడియాతో మాట్లాడారు. సోము వీర్రాజు స్పందిస్తూ, విశాఖలో భూ దందాలకు పాల్పడ్డవారిపై విచారణకు గతంలో సిట్ వేశారని వెల్లడించారు. అయితే, టీడీపీ, వైసీపీ ఆ సిట్ నివేదికలను బహిర్గతం చేయలేదని తెలిపారు. నిందితులతో రెండు పార్టీలు కుమ్మక్కవడం వల్లే నివేదికలు బయటికి రాలేదని సోము వీర్రాజు ఆరోపించారు.
జీవీఎల్ మాట్లాడుతూ, విశాఖ భూభాగోతాలపై ఈ నెల 11న గవర్నర్ కు లేఖ రాశానని వెల్లడించారు. 22ఏ కింద ఉన్న భూముల విషయమై నిర్ణయం తీసుకోవాలని కోరామని తెలిపారు. బీజేపీ ఒత్తిడి వల్లే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని అన్నారు. సిట్ నివేదికలు బయటపెట్టకపోతే ఎవరినీ వదలబోమని హెచ్చరించారు. విశాఖ భూ దందాలో టీడీపీ, వైసీపీ నేతల పాత్ర ఉందని జీవీఎల్ స్పష్టం చేశారు.
కాగా, విశాఖలో పవన్ కల్యాణ్ పై ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామని సోము వీర్రాజు తెలిపారు. విజయవాడలో పవన్ కల్యాణ్ ను కలిసి సంఘీభావం తెలిపామని పేర్కొన్నారు. విశాఖ ఘటనపై బీజేపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసిందని, సరైన సమయంలో చర్యలు ఉంటాయని సోము వీర్రాజు వివరించారు.