Rahul Gandhi: కేసీఆర్ అంతర్జాతీయ పార్టీ స్థాపించి చైనాలో కూడా పోటీ చేయొచ్చు: రాహుల్ గాంధీ
- తెలంగాణలో ఆరో రోజు కొనసాగుతున్న రాహుల్ గాంధీ యాత్ర
- షాద్ నగర్ నుంచి కొత్తూరు చేరుకున్న భారత్ జోడో యాత్ర
- మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ
- టీఆర్ఎస్ తో ఎలాంటి మైత్రి లేదని వెల్లడి
- బీజేపీ, టీఆర్ఎస్ దోచుకునే పార్టీలని విమర్శలు
తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆరో రోజు కొనసాగుతోంది. నేడు షాద్ నగర్ నుంచి కొత్తూరు వరకు 13 కిమీ మేర పాదయాత్ర జరిగింది. కొత్తూరు వద్ద విరామం ప్రకటించగా, రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో టీఆర్ఎస్ తో తమకు ఎలాంటి దోస్తీ ఉండదని స్పష్టం చేశారు. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేసుకున్నా తమకేమీ అభ్యంతరంలేదని అన్నారు. కేసీఆర్ అంతర్జాతీయ పార్టీ స్థాపించి చైనాలో కూడా పోటీ చేయొచ్చని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్పందిస్తూ, ఎమ్మెల్యేల కొనుగోలుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలు దోచుకునే పనిలో ఉన్నాయని అన్నారు. మోదీ హయాంలో వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సంస్థలను కూడా ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు.
విద్వేష, విచ్ఛిన్నకర రాజకీయాలకు వ్యతిరేకంగానే భారత్ జోడో యాత్ర చేపట్టానని, తనతో లక్షల మంది నడుస్తున్నారని రాహుల్ గాంధీ వెల్లడించారు. పాదయాత్ర ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటున్నానని తెలిపారు. గతంలో తన తండ్రి రాజీవ్ గాంధీ చార్మినార్ నుంచి యాత్ర చేశారని, ఇప్పుడు అక్కడి నుంచి తాను భారత్ జోడో యాత్ర చేస్తున్నానని వివరించారు.