Blue Tick: ట్విట్టర్ 'బ్లూ టిక్' ఫీజు పెంచనుందన్న వార్తలపై స్పందించిన కేంద్రం
- ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న ఎలాన్ మస్క్
- 'బ్లూ టిక్' ఫీజు పెంపు అంటూ ప్రచారం
- అసత్య ప్రచారం అయ్యుంటుందన్న కేంద్రం
- దీన్ని ట్విట్టర్ గమనించాలని సూచన
ట్విట్టర్ ను చేజిక్కించుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుండడం తెలిసిందే. ట్విట్టర్ లో సెలబ్రిటీ ఖాతాల 'బ్లూ టిక్' ఫీజును కూడా పెంచనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటిదాకా 'బ్లూ టిక్' ఫీజు రూపంలో నెలకు రూ.410 వసూలు చేస్తున్న ట్విట్టర్, ఇకపై ఆ ఫీజును రూ.1,650కి పెంచనుందని ప్రచారం జరుగుతోంది.
దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ వార్తలు నిజమని తాము నమ్మడంలేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు సమాచారం ఎలా వ్యాప్తి చెందుతోందో ట్విట్టర్ గమనించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు ట్విట్టర్ కు సవాల్ అని భావిస్తున్నామని తెలిపారు.