Dharmana Prasad: ఇప్పుడు కాకపోతే.. విశాఖ మరెప్పుడూ రాజధాని కాలేదు: ధర్మాన ప్రసాదరావు
- రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలు విశాఖకు ఉన్నాయన్న ధర్మాన
- ప్రాంతాల మధ్య అసమానత ఉంటే అస్థిరత ఏర్పడుతుందని వ్యాఖ్య
- ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకోవద్దని విపక్షాలకు విన్నవించిన వైనం
రాష్ట్ర రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలు విశాఖకు ఉన్నాయని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. అభివృద్ధి విషయంలో ప్రాంతాల మధ్య అసమానత ఉంటే అస్థిరత ఏర్పడుతుందని చెప్పారు. అవసరాలను బట్టి పాలన వికేంద్రీకరణ చేయాలనే డిమాండ్లు గతంలోనే వచ్చాయని అన్నారు. నివేదికలు, నిపుణులు సూచించినట్టే ముఖ్యమంత్రి జగన్ చేస్తున్నారని చెప్పారు. విశాఖ ఇప్పుడు రాజధాని కాకపోతే మరెప్పుడూ కాలేదని అన్నారు.
ప్రజాసమస్యలు ప్రతిపక్షాలకు పట్టవని విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకోవద్దని విపక్షాలను కోరుతున్నానని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణపై ప్రజల్లో ఆలోచనను పెంచడానికే పదవికి రాజీనామా చేయాలనుకున్నానని తెలిపారు. అమరావతి రాజధాని కోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో రహస్యంగా 3,500 జీవోలను ఇచ్చారని చెప్పారు. ఈరోజు విశాఖలో జరిగిన 'మన రాజధాని - మన విశాఖ' సదస్సులో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.