Team New Zealand: న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లతో సిరీస్ లకు భారత జట్టు ఎంపిక... కెప్టెన్ గా పాండ్యాకు ఛాన్స్
- టీ20 వరల్డ్ ముగియగానే న్యూజిలాండ్ తో టీ20, వన్డే సిరీస్ ఆడనున్న భారత్
- ఆ తర్వాత బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ ఆడనున్న టీమిండియా
- న్యూజిలాండ్ తో సిరీస్ కు రోహిత్, రాహుల్, కోహ్లీలకు విశ్రాంతి
- బంగ్లాదేశ్ తో సిరీస్ తో తిరిగి జట్టులోకి రానున్న రవీంద్ర జడేజా
టీ20 వరల్డ్ కప్ ముగియగానే... భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లతో వరుస సిరీస్ లు ఆడనుంది. ఈ రెండు దేశాలతో జరిగే సిరీస్ ల కోసం టీమిండియా జట్లను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత జరిగే న్యూజిలాండ్ తో సిరీస్ లో భాగంగా భారత్ ఆల్ రౌండర్ హార్డిక్ పాండ్యా టీమిండియాకు కెప్టెన్ గా బంపర్ ఆఫర్ కొట్టేశాడు. న్యూజిలాండ్ తో జరిగే టీ20 సిరీస్ కు భారత జట్టు కెప్టెన్ గా పాండ్యా వ్యవహరించనున్నాడు.
ఇక న్యూజిలాండ్ తో జరిగే వన్డే సిరీస్ కు శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. ఈ రెండు సిరీస్ లకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీలకు విశ్రాంతి నిచ్చిన బీసీసీఐ... రోహిత్ స్థానంలో స్థానంలో పాండ్యా, గబ్బర్ లకు కెప్టెన్సీ పగ్గాలను అప్పగించింది. ఇక ఈ రెండు సిరీస్ లకు వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ వ్యవహరించనున్నాడు.
ఇక న్యూజిలాండ్ తో టీ20, వన్డే సిరీస్ లు ముగిసిన వెంటనే మొదలయ్యే బంగ్లాదేశ్ జట్టుతో సిరీస్ కు రోహిత్ శర్మతో పాటు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు కూడా అందుబాటులోకి రానున్నారు. న్యూజిలాండ్ సిరీస్ కు సంజూ శాంసన్ ను జట్టులోకి తీసుకున్న బీసీసీఐ... బంగ్లాదేశ్ తో జరిగే సిరీస్ కు మాత్రం తప్పించేసింది. అదే సమయంలో గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ కు కూడా దూరమైన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బంగ్లాదేశ్ తో సిరీస్ కు జట్టుకు అందుబాటులోకి రానున్నాడు. ఇక ఈ ఇరు దేశాల జట్లతో జరిగే సిరీస్ లకు ఆయా జట్ల ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సుర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, కుల్ దీప్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, హర్షల్ పటేల్,మొహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్
న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్, దీపక్ హుడా, సుర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యజువేంద్ర చాహల్, కుల్ దీప్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్ దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్.
బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మొహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, యష్ దయాల్.