Morbi: రాత్రికి రాత్రే రంగులేశారు.. ప్రధాని పర్యటన నేపథ్యంలో మోర్బీలో ఆసుపత్రికి మరమ్మతులు
- నేడు మోర్బీలో మోదీ పర్యటన
- బ్రిడ్జి కూలిన ప్రాంతాన్నిపరిశీలించనున్న ప్రధాని
- అర్ధరాత్రి మరమ్మతులపై కాంగ్రెస్, ఆప్ విమర్శలు
- ప్రధాని ఫొటోషూట్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారని మండిపాటు
గుజరాత్ లోని మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలి 141 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై ఇప్పటికే సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. మంగళవారం మోర్బీలో పర్యటించనున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు.
ఇక ప్రధాని రాక నేపథ్యంలో మోర్బీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేరుకుపోయిన సమస్యలపై దృష్టి పెట్టారు. రాత్రికి రాత్రే ఆసుపత్రి గోడలకు రంగులు వేయించడంతో పాటు అవసరమైన మరమ్మతులు చేపట్టారు. రాత్రిపూట మరమ్మతులు జరుగుతుండడంతో స్థానిక మీడియా అక్కడికి చేరుకుంది. రంగులు వేస్తున్న సిబ్బందిని, ఆసుపత్రిలో చేపట్టిన మరమ్మతులను ఫొటోలు తీసి ప్రసారం చేసింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరోపక్క, అర్ధరాత్రి ఆసుపత్రిలో మరమ్మతులు చేపట్టడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోషూట్ కోసం బీజేపీ బిజీబిజీగా ఏర్పాట్లు చేస్తోందని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు. ఓవైపు పెద్ద సంఖ్యలో జనం చనిపోవడం, బాధిత కుటుంబాలు తీరని దుఖంలో మునిగిపోగా.. బీజేపీ పెద్దలు మాత్రం ప్రధాని పర్యటన కోసం ఏర్పాట్లలో మునిగిపోవడం విచారకరమని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో అంతా బాగుందని ప్రధానికి చూపించేందుకు అధికారులు అర్ధరాత్రి ఏర్పాట్లు చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ట్విట్టర్లో ఆరోపించింది.