AAP: తీహార్ జైలులో రక్షణ కోసం ఆప్ మంత్రికి రూ. పది కోట్లు లంచం ఇచ్చానంటున్న ఆర్థిక నేరగాడు సుకేశ్

Was forced to pay crores to AAP minister conman Sukesh writes to Delhi LG

  • జైలు నుంచి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు లేఖ
  • ముడుపుల కేసులో అరెస్టయిన తనను 2017, 2019లో తీహార్ జైలులో మంత్రి సత్యేంద్ర పలుమార్లు కలిశాడని వెల్లడి
  • జైలులో రక్షణ, ఇతర సౌకర్యాల కోసం జైళ్ల శాఖ డీజీ  రూ.12 కోట్లు వసూలు చేశారన్న సుకేశ్
  • దక్షిణాదిలో ఆప్ పార్టీలో పదవి, రాజ్యసభ సీటు ఇస్తానంటే పార్టీకి మరో 50 కోట్లు ఇచ్చినట్టు వెల్లడి 

ప్రముఖుల నుంచి డబ్బు వసూళ్లు చేసి అరెస్టయిన ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. తీహార్ జైలులో తనకు రక్షణ, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు సత్యేంద్ర జైన్ తన నుంచి బలవంతంగా రూ.10 కోట్లు వసూలు చేశారన్నాడు. 

అలాగే, దక్షిణాదిలో ఆప్ పార్టీ ముఖ్యమైన పదవి, రాజ్యసభ సీటు ఇస్తానని ఆశ చూపెట్టి మరో 50 కోట్లు వసూలు చేశారని చెప్పాడు. ఢిల్లీ జైళ్ల శాఖ డీజీ సందీప్ గోయెల్ కు కూడా రూ. 12 కోట్ల లంచం ఇచ్చినట్టు వెల్లడించాడు. ఈ మేరకు తగిన ఆధారలు సూచిస్తూ ఢిల్లీలోని మండోలి జైలు నుంచి తన లాయర్ ద్వారా సుకేశ్.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాయడం సంచలనం సృష్టించింది. 

సత్యేంద్ర  జైన్, సందీప్ గోయెల్ కు చేసిన చెల్లింపులను తాను గత నెలలో సీబీఐ దర్యాప్తు బృందానికి వెల్లడించానని, సీబీఐ విచారణ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశానని చంద్రశేఖర్ పేర్కొన్నాడు. దాంతో,  సత్యేంద్ర  జైన్ తనను బెదిరిస్తున్నారని, ఫిర్యాదును ఉపసంహరించుకోవాలంటూ వేధింపులకు గురిచేశారని, దాడి చేశారని సుకేశ్ ఆరోపించాడు.

 ‘ముడుపుల కేసులో 2017లో నన్ను అరెస్టు చేసిన తర్వాత తీహార్ జైలులో ఉంచారు. అప్పుడు జైళ్ల శాఖ మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్ అనేకసార్లు నన్ను సందర్శించారు. 2019లో కూడా జైలుకు వచ్చి కలిశారు. జైలులో రక్షణ, కనీస సౌకర్యాలు కల్పించాలంటే  ప్రతినెలా రూ. 2 కోట్లు ఇవ్వాలని ఆయన సెక్రటరీ నన్ను అడిగారు’ అని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

రాజ్యసభకు నామినేట్ చేస్తామని హామీ
ప్రముఖుల నుంచి డబ్బు వసూలు చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన చంద్రశేఖర్ ను తొలుత తీహార్ జైలులో ఉంచారు. కానీ, అతను పలుమార్లు చేసిన విజ్ఞప్తి మేరకు ఢిల్లీలోని మండోలి జైలుకు మార్చారు. తనను హత్య చేస్తామంటూ తీహార్ జైలు నుంచి బెదిరింపులు వచ్చినట్లు అతను పేర్కొన్నాడు.

‘2015 నుంచి సత్యేంద్ర జైన్ నాకు తెలుసు. సౌత్ జోన్‌లో పార్టీలో నాకు ముఖ్యమైన పదవిని ఇస్తానని, తరువాత నన్ను రాజ్యసభకు నామినేట్ చేయడానికి కూడా హామీ ఇవ్వడంతో పార్టీకి విరాళంగా నేను రూ. 50 కోట్లకు పైగా ఇచ్చాను’ ఢిల్లీ ఎల్జీకి రాసిన లేఖలో సుకేశ్ తెలిపాడు.

కాగా, ఈ విషయంలో తదుపరి చర్య కోసం ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా ఈ లేఖను ఆప్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం తీహార్ జైలుకు సంబంధించినది కాబట్టి, ఢిల్లీ ప్రభుత్వ హోం శాఖ ఈ కేసులో తదుపరి చర్యలను ప్రారంభించనుంది. కాగా, మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ను కూడా ఈ ఏడాది మేలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది.

  • Loading...

More Telugu News