Heavy Rains: తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు... ముగ్గురి మృతి
- తమిళనాడుపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం
- గత 24 గంటల వ్యవధిలో భారీ వర్షాలు
- ముగ్గురి మృతి.. చెన్నైలో వర్ష బీభత్సం
- 8 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో చెన్నై నగరం సహా 13 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో కురిసిన వర్షాలకు తమిళనాడులోని అనేక ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి.
వర్ష బీభత్సానికి ముగ్గురు మరణించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చెన్నైలో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. భారీ వర్షాల కారణంగా 8 జిల్లాల్లో పాఠశాలలకు తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కాగా, తమిళనాడుతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
తమిళనాడును ఈ నెల 29న ఈశాన్య రుతుపవనాలు తాకాయి. ఈ నేపథ్యంలో ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్ఎంసీ) నవంబరు 2 వరకు చెన్నై నగరానికి భారీ వర్ష సూచన చేసింది. తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఆర్ఎంసీ పేర్కొంది.