England: టీ20 వరల్డ్ కప్ లో కివీస్ కు తొలి ఓటమి... ఇంగ్లండ్ ఘనవిజయం
- సూపర్-12 దశలో ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్
- టాస్ గెలిచిన ఇంగ్లండ్
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు
- లక్ష్యఛేదనలో 6 వికెట్లకు 159 పరుగులే చేసిన కివీస్
ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. సూపర్-12 దశలో భాగంగా జరిగిన నేటి మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు 20 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
బ్రిస్బేన్ లో జరిగిన ఈ గ్రూప్-1 మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసింది. అనంతరం 180 పరుగుల లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులే చేసింది.
ఓ దశలో గ్లెన్ ఫిలిప్స్ (62), కేన్ విలియమ్సన్ (40) ఊపు చూస్తే కివీస్ సునాయాసంగా గెలిచేట్టు కనిపించింది. అయితే, వీరిద్దరూ అవుటయ్యాక ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. టాపార్డర్ మొత్తం పెవిలియన్ కు చేరడంతో మిచెల్ శాంట్నర్ (16 నాటౌట్), ఇష్ సోధీ (6 నాటౌట్) వంటి లోయరార్డర్ బ్యాట్స్ మెన్ భారీ షాట్లు కొట్టలేక ఇబ్బందిపడ్డారు.
జేమ్స్ నీషామ్ (6), డారిల్ మిచెల్ (3) విఫలం కావడం కివీస్ అవకాశాలపై ప్రభావం చూపింది. అంతకుముందు, న్యూజిలాండ్ కు ఓపెనర్లు ఫిన్ అలెన్ (16), డెవాన్ కాన్వే (3) పేలవ ఆరంభాన్నిచ్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2, శామ్ కరన్ 2, మార్క్ ఉడ్ 1, బెన్ స్టోక్స్ 1 వికెట్ తీసి జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు.
ఈ విజయంతో ఇంగ్లండ్ గ్రూప్-1 పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి చేరింది. ఇంగ్లండ్ ఇప్పటిదాకా 4 మ్యాచ్ లు ఆడి రెండు విజయాలు సాధించింది. ఈ గ్రూప్ లో న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.