Andhra Pradesh: విశాఖలో నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన రాండ్ స్టాండ్
- ఉద్యోగాల కల్పనలో మేటి సంస్థగా రాండ్ స్టాండ్ కు పేరు
- ఏపీలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని యువతకు ఉద్యోగాల కల్పనకే విశాఖలో కార్యాలయం
- కార్యక్రమంలో పాలుపంచుకున్న మంత్రి గుడివాడ అమర్ నాథ్
ఉద్యోగాల కల్పనలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధ సంస్థగా పేరు గాంచిన రాండ్ స్టాండ్ ఏపీలోని విశాఖపట్నంలో మంగళవారం తన నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇదివరకే ఈ దిశగా ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న రాండ్ స్టాండ్ మంగళవారం విశాఖలో తన కార్యాలయాన్ని ప్రారంభించింది. వచ్చే ఏడాదిలోగా ఏపీలో 3 వేల ఐటీ ఉద్యోగాల కల్పన దిశగా సాగనున్న ఈ కంపెనీ... 2024లోగా రాష్ట్ర యువతకు 5 వేల ఉద్యోగాలను కల్పించే దిశగా చర్యలు చేపట్టనుంది.
రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన యువతలో నైపుణ్యాలను వెలికి తీసి... వారిని ఐటీ రంగంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో రాండ్ స్టాండ్ పనిచేయనుంది. విశాఖలో మంగళవారం నాటి రాండ్ స్టాండ్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులతో పాటు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కూడా పాల్గొన్నారు.