Bandi Sanjay: మునుగోడు వెళ్లేందుకు బండి సంజయ్ యత్నం.. అర్ధరాత్రి ఉద్రిక్తత
- మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులోనే ఉన్నా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని ఆరోపణ
- మలక్‌పేట, వనస్థలిపురం వద్ద బండి సంజయ్‌ను అడ్డుకునే యత్నం
- అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అర్ధరాత్రి వేళ మునుగోడు వెళ్లేందుకు చేసిన ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మునుగోడులోనే ఉన్నా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆయన మునుగోడు బయలుదేరారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
బండి సంజయ్‌ను తొలుత మలక్‌పేట వద్ద పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆయన ముందుకే వెళ్లారు. ఆ తర్వాత వనస్థలిపురం వద్ద అడ్డుకున్నారు. అక్కడ కూడా కార్యకర్తలు అండగా నిలవడంతో బండి సంజయ్ ముందుకెళ్లారు. ఆ తర్వాత అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఆయనను నిలువరించగలిగారు. కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.