diabetics: మధుమేహం ఉన్నవారు ఏ పప్పులు తినొచ్చు?
- గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నవాటితో మంచి ఫలితాలు
- పప్పు ధాన్యాల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ
- ప్రొటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువ
పప్పులు లేదా కాయధాన్యాల్లో పోషకాలు దండిగా ఉంటాయని తెలుసు. వీటిని చిన్నారుల నుంచి పెద్ద వారి వరకు అందరూ తినాలన్నది పోషకాహార నిపుణుల సూచన. మరి మధుమేహంతో ఉన్న వారికి ఏ పప్పులు అనుకూలం? ఈ తరహా సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. ఎందుకంటే పప్పుల్లోనూ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.
మన దేశంలో మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగానే ఉంది. ప్రొటీన్ తో కూడిన పప్పులు వీరి ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. పప్పుల్లో ఫైబర్ ఉంటుంది. దీనికి ప్రొటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తోడు కావడంతో ఒకేసారి కాకుండా జీర్ణక్రియ నిదానంగానే ఉంటుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ ఒకేసారి గణనీయంగా పెరిగిపోవడం ఉండదు. పైగా వీటిల్లో విటమిన్లు, మినరల్స్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్, మెగ్నీషియం కూడా లభిస్తాయి. ఫైటోకెమికల్స్ కూడా ఉంటాయి. అంతేకాదు బలమైన యాంటీ కాన్సినో జెనిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పప్పులకు ఉంటాయి. కొలెస్ట్రాల్, రక్తపోటు నియంత్రణలో వీటి పాత్ర ఉంటుందని పరిశోధనల్లో కూడా వెల్లడైంది.
మధుమేహం కానీ, మరే ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు అయినా.. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నవి, కొలెస్ట్రాల్ తగ్గించేవి, ఫైబర్, మినరల్స్, ఆరోగ్యకరమైన కొవ్వులతో ఉన్న వాటిని తీసుకోవడం సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
‘‘మసూర్ దాల్ మంచిది. రక్తంలో షుగర్, కొలెస్ట్రాల్ ను ఇది నియంత్రిస్తుంది. బరువు తగ్గేందుకు కూడా సాయపడుతుంది. మినప్పప్పు కూడా బ్లడ్ షుగర్ తగ్గించి, శక్తినిస్తుంది. ఇక పెసరపప్పును మర్చిపోవద్దు. ఇది తక్కువ కేలరీలు, ఫైబర్, ప్రొటీన్, మంచి పోషకాలు కలిగి ఉంటుంది’’ అని అపోలో హాస్పిటల్స్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జినాల్ పటేల్ వివరించారు.
చిక్ పీస్/చానా
శనగపప్పులో గ్లైసిమిక్ ఇండెక్స్ 33. ఇది తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోదు. ప్రొటీన్, విటమిన్స్, మినరల్స్ లభిస్తాయి.
కిడ్నీ బీన్స్/రాజ్మా
రాజ్మాలో గ్లైసిమిక్ ఇండెక్స్ 19. ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఫైబర్ కూడా ఉన్న ఇది మధుమేహం ఉన్న వారికి మంచి ఆప్షన్.
బెంగాల్ గ్రామ్
ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ 8. ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఉండడంతో తప్పకుండా దీన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి.
మూంగ్ డాల్ (పెసరపప్పు)
గ్రీన్ గ్రామ్ దాల్ గా కూడా పిలిచే పెసరపప్పులో గ్లైసిమిక్ ఇండెక్స్ 38. ప్రొటీన్ పష్కలంగా లభిస్తుంది.
ఉరద్ దాల్
మినప్పప్పులో గ్లైసిమిక్ ఇండెక్స్ 43. ప్రొటీన్లు కూడా దీని ద్వారా లభిస్తాయి.
కందిపప్పు
తూర్ దాల్ లేదా ఆర్హార్ దాల్ గా పిలిచే కందిపప్పులో గ్లైసిమిక్ ఇండెక్స్ 22. మధుమేహంతో ఉన్న వారికి ఇది మంచి ఫుడ్ అవుతుంది. ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.