Hemant Soren: చేతనైతే నన్ను అరెస్ట్ చేసుకోండి... కేంద్రానికి సవాల్ విసిరిన ఝార్ఖండ్ సీఎం
- హేమంత్ సొరెన్ పై మనీలాండరింగ్ ఆరోపణలు
- సమన్లు జారీ చేసిన ఈడీ
- తప్పు చేశానని భావిస్తే విచారణ ఎందుకన్న సొరెన్
- రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు
అక్రమ మైనింగ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేయడం తెలిసిందే. నేడు (గురువారం) విచారణకు హాజరు కావాలంటూ ఆ సమన్లలో పేర్కొన్నారు.
దీనిపై హేమంత్ సొరెన్ ఘాటుగా స్పందించారు. "నేను తప్పు చేశానని భావిస్తే ఇక నన్ను ప్రశ్నించడం ఎందుకు? చేతనైతే వచ్చి నన్ను అరెస్ట్ చేసుకోండి" అంటూ కేంద్రానికి సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఝార్ఖండ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కేంద్ర సంస్థలను ఉసిగొల్పుతోందని ఆరోపించారు.
తాను సీబీఐ, ఈడీలకు భయపడబోనని హేమంత్ సొరెన్ స్పష్టం చేశారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న వారిని అణచివేసేందుకు రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఈ కుట్రకు తగిన సమాధానం త్వరలోనే వస్తుంది అని సొరెన్ స్పష్టం చేశారు.