Pakistan: పాకిస్థాన్, దక్షిణాఫ్రికా మ్యాచ్ కు వర్షం అడ్డంకి
- సిడ్నీలో మ్యాచ్.. 9 ఓవర్ల వద్ద వర్షం
- మ్యాచ్ నిలిచిపోయే సమయానికి దక్షిణాఫ్రికా స్కోరు 69/4
- డీఎల్ఎస్ సమీకరణానికి 15 రన్స్ దూరంలో సఫారీలు
సిడ్నీలో పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ సూపర్-12 మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగింది. వర్షం వల్ల మ్యాచ్ నిలిచిపోయిన సమయానికి దక్షిణాఫ్రికా 9 ఓవర్లలో 4 వికెట్లకు 69 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే ఇంకా 66 బంతుల్లో 117 పరుగులు చేయాలి.
మ్యాచ్ ఇంతటితో ఆగిపోతే... దక్షిణాఫ్రికా విజయానికి డీఎల్ఎస్ ప్రకారం స్కోరు 84 పరుగులు ఉండాలి. కానీ ఆ జట్టు డీఎల్ఎస్ సమీకరణానికి ఇంకా 15 పరుగులు వెనుకబడి ఉంది. సఫారీలకు వరల్డ్ కప్ లలో వరుణుడు మోకాలడ్డడం కొత్తేమీకాదు. అనేక వరల్డ్ కప్ టోర్నీలలో దక్షిణాఫ్రికా విజయావకాశాలను వర్షం దెబ్బతీయడం తెలిసిందే.
నేటి మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 185 పరుగులు చేసింది. అయితే, లక్ష్యఛేదనలో సఫారీలు పోరాటపటిమ కనబర్చారు. 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ కెప్టెన్ టెంబా బవుమా (36), మార్క్ క్రమ్ (20) జోడీ భారీ షాట్లతో విజృంభించింది. అయితే వీరిద్దరినీ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ అవుట్ చేయడంతో పాక్ ఊపిరిపీల్చుకుంది. 9 ఓవర్ల సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది.