Chaina: భూమిపై పడనున్న చైనా రాకెట్ శకలాలు.. ముప్పు ఎంతవరకు వుండచ్చంటే..!

Another huge piece of Chinese space junk is falling to Earth

  • న్యూ తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తున్న చైనా
  • నేడు భూ కక్ష్యలోకి లాంగ్‌మార్చ్ రాకెట్
  • కొంతభాగం కాలిపోయాక భూమిపై పడనున్న శకలాలు
  • ఎక్కడ పడతాయన్న విషయంలో లేని స్పష్టత
  • జనసమ్మర్థ ప్రాంతాల్లో పడే అవకాశం ఉందంటున్న నిపుణులు

తమకంటూ ప్రత్యేకంగా స్పేస్ స్టేషన్ నిర్మించుకుంటున్న చైనా గత సోమవారం పంపిన చివరి రాకెట్ భూమిపై పడబోతోందన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. గతంలో పంపినవి కూడా నియంత్రణ లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడ పడ్డాయి. అయితే, వీటి వల్ల ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా పంపిన రాకెట్ మాత్రం జనసమ్మర్థ ప్రాంతాల్లో కూలే అవకాశం ఉందని చెబుతున్నారు. 23 టన్నుల బరువుండే ఈ రాకెట్ శకలాలు ఎక్కడ పడతాయో తెలియక జనం భయంభయంగా గడుపుతున్నారు. 

తుది దశకు అంతరిక్ష నిర్మాణ పనులు
అంతరిక్షంలో చైనా చేపట్టిన న్యూ తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రం పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. ఈ కేంద్రం నిర్మాణం కోసం చైనా గత సోమవారం చివరి మాడ్యూల్‌ను పంపించింది. లాంగ్ మార్చ్ 5బి రాకెట్‌తో చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైందని చైనా ప్రకటించింది. ఈ రాకెట్ భూ కక్ష్యను చేరుకున్న తర్వాత తిరిగి భూమిపైకి ప్రవేశిస్తుంది. ఇందుకు సంబంధించి 28 గంటల రీ ఎంట్రీ విండో నేటి సాయంత్రం మొదలై రేపంతా కొనసాగుతుంది. దాదాపు 10 అంతస్తుల భవనమంత ఉండే ఈ రాకెట్ భూ వాతావరణంలోకి చేరుకున్న తర్వాత కొంతభాగం కాలిపోయినప్పటికీ కొన్ని ప్రధాన భాగాలు మాత్రం భూమిపై పడిపోతాయి. 

మానవాళికి ముప్పే
రాకెట్ శకలాలు ఎక్కడ కూలుతాయనే విషయంలో స్పష్టత లేకపోవడం గందరగోళానికి, భయానికి గురిచేస్తోంది. ఈ శకలాల వల్ల మానవాళికి కొంత ప్రమాదం ఉండొచ్చని ఏరో స్పేస్ కార్పొరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ శకలాలు 88 శాతం ప్రపంచ జనాభా నివసించే చోట పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే, శకలాలలో ఎక్కువ శాతం జనసాంద్రత తక్కువ ఉండే ప్రదేశాలు, సముద్రాలు, ఖాళీ ప్రదేశాల్లో పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతుండడం కొంత ఊరటనిచ్చే అంశమే. అదే జరిగితే ముప్పు తగ్గుతుందని చెబుతున్నారు.

అంతరిక్ష నిర్మాణం కోసం లాంగ్ మార్చ్ రాకెట్‌ను ఇప్పటి వరకు చైనా నాలుగుసార్లు ప్రయోగించింది. అంతకుముందు పంపిన మూడు రాకెట్లు భూమిపై పడిపోయాయి. గతేడాది పంపిన రాకెట్ శకలాలు మాల్దీవుల సమీపంలో పడ్డాయి. ఈ ఏడాది జులైలో పంపిన రాకెట్ శకలాలు మలేసియా, ఇండోనేసియా సమీపంలోని ఓ ద్వీపంలో, ఫిలిప్పీన్స్ సమీపంలోని ఓ సముద్రంలో పడిపోయాయి.

  • Loading...

More Telugu News