Newborn Baby: ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఘటన.. నవజాత శిశువు కడుపులో 8 పిండాలు!

8 undeveloped fetuses found inside stomach of newborn baby

  • ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఘటన
  • గత నెల 10న జన్మించిన చిన్నారి
  • కడుపు నొప్పితో బాధపడుతుండడంతో ఆసుపత్రిలో చేర్పించిన తల్లిదండ్రులు
  • స్కాన్ చేస్తే కడుపులో కణితులు ఉన్నట్టు గుర్తింపు
  • ఆపరేషన్ చేశాక వాటిని పిండాలుగా గుర్తించిన వైద్యులు

ప్రపంచ వైద్య చరిత్రలోనే ఇది వింత. పుట్టి నెల రోజులు కూడా కాని ఓ శిశువు నుంచి 8 పిండాలను వైద్యులు తొలగించారు. అత్యంత అరుదైన ఈ ఘటన ఝార్ఖండ్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాంచీలోని రామ్‌గఢ్‌లో అక్టోబరు 10న ఓ పాప జన్మించింది. ఆ తర్వాత ఆ చిన్నారి కడుపు నొప్పితో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. సీటీ స్కాన్ నిర్వహించిన వైద్యులు కడుపులో కణితులు ఉన్నట్టు గుర్తించారు. అనంతరం 21 రోజులు పర్యవేక్షణలో ఉంచారు. 

తాజాగా, ఈ నెల 1న కణితులు తొలగించేందుకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ చేస్తున్న వైద్యులు లోపల కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. అవి కణితులు కావని, సరిగా అభివృద్ధి చెందని పిండాలని గుర్తించారు. గంటన్నరపాటు ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. శిశువుల పొట్టలో అభివృద్ధి చెందని పిండాలు వెలుగు చూసిన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా వందలోపే ఉన్నట్టు ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు. ఆయా కేసుల్లో ఒక పిండాన్ని మాత్రమే తొలగించారని, కానీ నవజాత శిశువులో ఏకంగా 8 పిండాలు ఉన్నాయని, ఇలాంటి ఘటన ప్రపంచంలో ఇదే మొదటిదని వైద్యులు వివరించారు.

  • Loading...

More Telugu News