Moonlighting: ‘మూన్ లైటింగ్’ ఉద్యోగులకు ఆదాయపన్ను శాఖ హెచ్చరిక!

Moonlighting Can Have Tax Implications Income Tax Authorities Latest Warning

  • ఉద్యోగుల రెండో ఆదాయానికి కూడా పన్ను చెల్లించాల్సిందేనంటున్న ఐటీ శాఖ
  • చెల్లింపు రూ. 30 వేలు దాటితే టీడీఎస్ కట్ చేయాల్సిందే
  • రెండో ఆదాయంపై ఐటీ రిటర్న్స్‌లో వెల్లడించాలంటున్న అధికారులు
  • లేదంటే జరిమానా తప్పదని హెచ్చరిక

మూన్ లైటింగ్.. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ పదం ఐటీ కంపెనీల్లో ప్రకంపనలు రేపింది. ఓ కంపెనీలో పనిచేస్తూ దాని కళ్లుగప్పి ఇంకో సంస్థలోనూ పనిచేయడాన్నే మూన్‌లైటింగ్ అంటారు. సాధారణంగా చెప్పుకోవాలంటే చాలామంది ఇలా రెండు ఉద్యోగాలు చేస్తుంటారు. చేస్తున్న ఉద్యోగంలో సరిపడా వేతనం లేకపోవడం, పెరిగిపోతున్న జీవన వ్యయాన్ని తట్టుకోలేక ఇలా ‘రెండు చేతులా’ సంపాదిస్తుంటారు. తమ సంస్థలో కాకుండా మరో కంపెనీలోనూ చేయడాన్ని జీర్ణించుకోలేని కొన్ని సంస్థలు ‘మూన్ లైటింగ్’ ఉద్యోగులను హెచ్చరించి వదిలేశాయి. విప్రోలాంటి సంస్థ 300 మంది ఉద్యోగులపై వేటేసింది. 

రూ. 30 వేలు దాటితే టీడీఎస్
తాజాగా, ఈ ‘మూన్‌ లైటింగ్’ వ్యవహారంపై ఆదాయపన్ను శాఖ కూడా దృష్టిసారించింది. రెండో ఉద్యోగంలో సంపాదించే దానికి కూడా పన్ను చెల్లించాల్సిందేనంటూ హెచ్చరికలు జారీ చేసింది. పన్ను నిబంధనలు రెండో ఉద్యోగానికి కూడా వర్తిస్తాయని తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు గానీ, ప్రొఫెషనల్ ఉద్యోగులకు కానీ ఏ కంపెనీ అయినా వ్యక్తిగత చెల్లింపులు అయినా సరే రూ. 30 వేలు దాటితే  ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ (టీడీఎస్) వర్తిస్తుందని తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ప్రిన్సిపల్ చీఫ్ ఐటీ కమిషనర్ ఆర్.రవిచంద్రన్ స్పష్టం చేశారు. 

వార్షిక చెల్లింపులు రూ. లక్ష దాటినా
ఆదాయపన్ను సెక్షన్‌లోని 194సి ప్రకారం.. కాంట్రాక్ట్ పని కోసం చేసే చెల్లింపుల నుంచి టీడీఎస్‌ను మినహాయించాల్సిందే. ఏదైనా సంస్థ, ట్రస్ట్ కానీ, కంపెనీ, స్థానిక యంత్రాంగం వంటివి దీని కిందికి వస్తాయి. నగదు చెల్లింపులు, చెక్, డ్రాఫ్ట్ ఎలా చెల్లించినా సరే టీడీఎస్‌ మినహాయింపు తప్పనిసరి. రూ. 30 వేలు దాటిన తర్వాత 10 శాతాన్ని టీడీఎస్ కింద మినహాయించాలని ఐటీ చట్టంలోని సెక్షన్ 194జె చెబుతోంది. అంతేకాదు, ఒక ఆర్థిక సంవత్సరంలో చేసిన చెల్లింపు లక్ష రూపాయలు దాటినప్పుడు కూడా టీడీఎస్‌ను మినహాయించాల్సి ఉంటుంది. 

దాచిపెడితే జరిమానా
ఈ నేపథ్యంలో ఉద్యోగులెవరైనా అదనపు ఆదాయం ఉన్నప్పుడు ఆ విషయాన్ని ఐటీ రిటర్న్స్‌లో వెల్లడించి, అందుకు పన్ను మొత్తాన్ని చెల్లించాలని ఐటీశాఖ కోరింది. అంతేకాదు, రెండో ఆదాయం అందుకుంటూ ఆ విషయాన్ని ఆ తర్వాత బయటపెడితే జరిమానా తప్పదని, విచారణ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని  హెచ్చరించింది.

  • Loading...

More Telugu News