- 60 శాతం డిస్కౌంట్ అడిగిన జొమాటో
- వినూత్నంగా స్పందిస్తున్న నెటిజన్లు
- జొమాటో భాషలోనే దీనికి బదులు
- ప్యాకేజింగ్, హ్యాండ్లింగ్, డెలివరీ చార్జీలు కలపండంటూ కామెంట్
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ ఇటీవల బ్లూ టిక్ ఖాతాదారులకు నెలవారీ చార్జీలను పెంచేసింది. యూజర్ అకౌంట్ అధికారికమైనదనే నిర్ధారణకు చిహ్నంగా ట్విట్టర్ బ్లూ టిక్ ఇస్తుంటుంది. దీని కోసం యూజర్లు ప్రతి నెలా 8 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని, లేదంటే బ్లూ టిక్ కోల్పోతారని సంస్థ కొత్త యజమాని మస్క్ ప్రకటించడం తెలిసిందే.
దీనిపై ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్ బుకింగ్ సేవల సంస్థ జొమాటో ఆసక్తికరంగా స్పందించింది. ‘ఓకే ఎలాన్, 8 డాలర్లలో 60 శాతం తగ్గింపు ఇస్తే ఎలా ఉంటుంది..? 5 డాలర్ల వరకు?’ అని ట్వీట్ చేసింది. దీనికి మస్క్ స్పందించలేదు కానీ, జొమాటో మంచి చర్చకు తెరతీసింది.
‘TESLA లేదంటే doggy అనే కూపన్ కోడ్ అప్లయ్ చేయండి’ అంటూ ఓ యూజర్ చమత్కారంగా కామెంట్ చేశాడు. జొమాటోలో డిస్కౌంట్ కూపన్ల మాదిరిగా ఈ సమాధానం ఇచ్చినట్టయింది. మరో యూజర్ స్పందిస్తూ.. ‘తప్పకుండా 60 శాతం డిస్కౌంట్ తర్వాత 3.2 డాలర్లు అవుతుంది. దీనికి 2.4 డాలర్లను ప్యాకేజింగ్ అండ్ హ్యాండ్లింగ్ చార్జీలు, డెలివరీ చార్జీల కింద మరో 2.4 డాలర్లను కలపండి. మొత్తం 8 డాలర్లు అవుతుంది. మీరు మా సేవను ఆనందించారని భావిస్తున్నాం’ అంటూ స్పందన వ్యక్తం చేశాడు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను స్వేచ్ఛగా మాట్లాడే వేదికగా చేస్తానంటూ.. మాట్లాడేందుకు నెలకు 8 డాలర్లు అడుగుతున్నారని ఓ మహిళా యూజర్ పేర్కొంది.