New Delhi: కాలుష్యం సమస్య పంజాబ్, ఢిల్లీకి మాత్రమే పరిమితమైనది కాదు: కేజ్రీవాల్
- కేంద్రం జోక్యం చేసుకోవాలన్న కేజ్రీవాల్
- కాలుష్యానికి పంజాబ్ కూడా కారణమేనని వ్యాఖ్య
- నిందలు, రాజకీయాలు చేయడం మానుకోవాలని కేంద్రాన్ని కోరిన ఢిల్లీ సీఎం
దేశ రాజధానిలో వాయు కాలుష్యం, గాలి నాణ్యత క్షీణించడం దేశ రాజధాని సమస్య మాత్రమే కాదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కేంద్రం జోక్యం చేసుకుని బాధ్యత వహించాలని కోరారు. ఈ సమస్య వ్యవసాయ రాష్ట్రమైన పంజాబ్ లేదా ఢిల్లీకి మాత్రమే పరిమితం కాదని అన్నారు.
ఈ విషయమై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో శుక్రవారం ఉదయం విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడారు. ‘వాయు కాలుష్యానికి పంజాబ్, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాలను మాత్రమే నిందించలేము. చర్యలు తీసుకునేందుకు కేంద్రం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే, ఇది పంజాబ్, ఢిల్లీకి మాత్రమే పరిమితమైనది కాదు. మొత్తం ఉత్తర భారతదేశ సమస్య’ అని ఆయన అన్నారు.
ఢిల్లీ గాలి నాణ్యతకు సంబంధించి మరొకరిపై నిందలు వేయడం మానుకోవాలని, బ్లేమ్ గేమ్‌కు దూరంగా ఉండాలని కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. దేశ రాజధానిలో కాలుష్యానికి ఆప్ నేతృత్వంలోని పంజాబ్ కూడా కారణం అని ఆయన అంగీకరించారు. అదే సమయంలో దీనికి రైతులను కూడా బాధ్యులను చేయొచ్చని, కానీ, నిందలు, రాజకీయాలకు ఇది సమయం కాదని కేజ్రీవాల్ అన్నారు.