Imran Khan: కాల్పుల్లో గాయపడిన ఇమ్రాన్ ఖాన్ కు శస్త్రచికిత్స
- లాంగ్ మార్చ్ ర్యాలీ చేపట్టిన ఇమ్రాన్ ఖాన్
- వజీరాబాద్ వద్ద ఆయనపై కాల్పులు
- కాలికి బుల్లెట్ గాయం
- లాహోర్ ఆసుపత్రికి తరలింపు
- నిలకడగా ఇమ్రాన్ ఆరోగ్యం
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిన్న ఓ ర్యాలీలో తుపాకీ కాల్పుల్లో గాయపడిన సంగతి తెలిసిందే. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇమ్రాన్ కాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన లాహోర్ లోని షౌకత్ ఖానుమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇమ్రాన్ ఖాన్ కు శస్త్రచికిత్స నిర్వహించినట్టు తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ నేత ఫవాద్ చౌదరి వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. పాకిస్థాన్ లో అత్యంత ప్రజాదరణ ఉన్న ఇమ్రాన్ ఖాన్ పై పక్కా ప్రణాళికతోనే కాల్పులు జరిపారని గట్టిగా నమ్ముతున్నామని చౌదరి పేర్కొన్నారు. కాగా, ఇమ్రాన్ చేపట్టిన లాంగ్ మార్చ్ ర్యాలీ పునఃప్రారంభంపై చర్చించామని, దానిపై నేడు ఓ ప్రకటన చేస్తామని చౌదరి చెప్పారు.
పాకిస్థాన్ లో ముందస్తు ఎన్నికలు చేపట్టాలన్న డిమాండ్ తో ఇమ్రాన్ ఖాన్ లాంగ్ మార్చ్ పేరిట లాహోర్ నుంచి రాజధాని ఇస్లామాబాద్ కు భారీ ర్యాలీ చేపట్టారు. అయితే ర్యాలీ నిన్న వజీరాబాద్ వద్దకు చేరుకోగానే, కంటైనర్ పై నిల్చుని ప్రజలకు అభివాదం చేస్తున్న ఇమ్రాన్ పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గాయపడిన ఇమ్రాన్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. దాంతో ర్యాలీ తాత్కాలికంగా నిలిచిపోయింది. తాజాగా, తెహ్రీకే నేత ఫవాద్ చౌదరి స్పందిస్తూ, ర్యాలీ వజీరాబాద్ నుంచే పునఃప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.