Janasena: పవన్ కల్యాణ్ పై ఎలాంటి రెక్కీ జరగలేదు... దాడికి కుట్ర కూడా లేదు: తెలంగాణ పోలీసుల వివరణ
- గత నెల 31న రాత్రి పవన్ ఇంటి వద్ద యువకుల హంగామా
- పవన్ సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగిన వైనం
- పోలీసుల విచారణలో మద్యం మత్తులోనే అలా చేశామని వెల్లడి
- ఈ వ్యవహారంలో రెక్కీ గానీ, దాడికి కుట్ర గానీ లేదన్న జూబ్లీహిల్స్ పోలీసులు
- జూబ్లీహిల్స్ పోలీసుల నివేదికను విడుదల చేసిన తెలంగాణ పోలీసు శాఖ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై దాడికి కుట్ర జరుగుతోందని, ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఆయన ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారంటూ జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ పోలీసు శాఖ శుక్రవారం వివరణ ఇచ్చింది. పవన్ కల్యాణ్ ఇంటి వద్ద ఎలాంటి రెక్కీ జరగలేదని, పవన్ పై దాడికి కూడా కుట్ర కూడా జరగలేదని ఆ శాఖ వెల్లడించింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఇచ్చిన నివేదికను తెలంగాణ పోలీసు శాఖ శుక్రవారం విడుదల చేసింది.
గత నెల 31న రాత్రి సమయంలో ఆదిత్య, సాయికృష్ణ, వినోద్ అనే ముగ్గురు యువకులు హైదరాబాద్ లోని పవన్ ఇంటి వద్ద పవన్ బౌన్సర్లతో గొడవకు దిగారు. ఈ క్రమంలో పవన్ ఇంటిపై రెక్కీ నిర్వహించేందుకే ఆ యువకులు అక్కడికి వచ్చారని, అంతేకాకుండా పవన్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వెంబడిస్తున్నారని జనసేన ఆందోళన వ్యక్తం చేసింది. గత నెల 31న రాత్రి ఘటనపై పవన్ సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు... గొడవకు కారణమైన యువకులను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో భాగంగా మద్యం మత్తులోనే తాము పవన్ కల్యాణ్ ఇంటి వద్ద కారు ఆపామని, ఆ సమయంలో తమ కారును అక్కడి నుంచి తీయమన్న పవన్ సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగామని ఆ యువకులు చెప్పినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సదరు యువకులకు నోటీసులు జారీ చేసి, పంపించివేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో రెక్కీ గానీ, పవన్ పై దాడికి కుట్ర గానీ జరగలేదని వారు స్పష్టం చేశారు.