YSRCP: ఆ రాయిని చంద్రబాబే విసిరించుకున్నారు: మంత్రి జోగి రమేశ్
- నందిగామలో చంద్రబాబు రోడ్ షోపై రాయితో దాడి
- అది చంద్రబాబు పనేనన్న జోగి రమేశ్
- చంద్రబాబు కొత్త నాటకానికి తెర తీశారని ఆరోపణ
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రోడ్ షోపై గుర్తు తెలియని వ్యక్తులు విసిరిన రాయి ఘటనపై ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ స్పందించారు. రోడ్ షోపై పడ్డ రాయిని చంద్రబాబే విసిరించుకున్నారని రమేశ్ అన్నారు. చంద్రబాబు కొత్త నాటకానికి తెర తీశారని ఆరోపించిన మంత్రి.. రాయి విసిరించుకోవడం ఆ కుట్రలో భాగమేనన్నారు. అయితే ఈ దాడిలో భద్రతా అధికారి గాయపడటం బాధాకరమన్నారు. దాడిలో గాయపడిన అధికారికి క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబేనని ఆయన అన్నారు.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను బరిలోకి దించుతానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని జోగి రమేశ్ ప్రశ్నించారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో తానే సీఎం అభ్యర్థినని ప్రకటించే దమ్ము జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఉందా? అని కూడా ఆయన ప్రశ్నించారు. లోపాయికారీ పొత్తులతో అధికారంలోకి రావాలని చంద్రబాబు చూస్తున్నారని, అది సాధ్యం కాదని కూడా రమేశ్ వ్యాఖ్యానించారు.