China Rocket: పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయిన చైనా రాకెట్
- భూవాతావరణంలోకి ప్రవేశించిన చైనా రాకెట్
- స్పెయిన్ భూభాగంలో పడిపోతుందని ప్రచారం
- హడలిపోయిన స్పెయిన్ వాసులు
- మెక్సికన్ తీరంలో కనిపించిన చైనా రాకెట్ శకలాలు
- నిర్ధారించిన అమెరికా స్పేస్ కమాండ్
అందరినీ హడలెత్తించిన చైనా లాంగ్ మార్చ్ రాకెట్ (సీజెడ్-5బీ) పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయింది. దీని శకలాలను మెక్సికన్ తీరంలో గుర్తించారు. ఈ రాకెట్ స్పెయిన్ పై కూలిపోతుందని భావించినా, అదృష్టవశాత్తు పసిఫిక్ జలాల్లో పడిపోయింది. దాంతో ప్రాణనష్టం తప్పినట్టయింది.
చైనా రాకెట్లు ఇలా భయాందోళనలు కలిగించే రీతిలో భూవాతావరణంలోకి రావడం రెండేళ్లలో ఇది నాలుగోసారి. కాగా, చైనా రాకెట్ కూలిపోయిన విషయాన్ని అమెరికా స్పేస్ కమాండ్ నిర్ధారించింది.
చైనా రాకెట్లు భూవాతావరణంలోకి ప్రవేశించిన ప్రతిసారి తీవ్ర కలకలం ఏర్పడడం పరిపాటిగా మారింది. అందుకు చైనా నిర్లక్ష్య వైఖరే కారణమని, తన రాకెట్లను చైనా నియంత్రించలేకపోతోందని ప్రపంచదేశాలు డ్రాగన్ కంట్రీని విమర్శిస్తున్నాయి. అయితే, ఈ నాలుగు పర్యాయాలు ఒక్కరికీ కూడా నష్టం కలిగించని రీతిలో చైనా రాకెట్లు కూలిపోయాయి.