China spy vessel: హిందూ మహాసముద్రంలో చైనా నిఘా నౌక.. క్షిపణి ప్రయోగం వాయిదా ఆలోచనలో కేంద్రం!
- ఈ నెల 10న బంగాళాఖాతంలో క్షిపణి ప్రయోగం
- గతంలోనే నోటమ్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
- అత్యాధునిక నిఘా పరికరాలతో బాలి తీరంలో చైనా నిఘా నౌక
- క్షిపణి ప్రయోగంపై నిఘా కోసమేనన్న అనుమానాలు
రక్షణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే క్షిపణి పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. హిందూ మహా సముద్రంలో చైనా నిఘా నౌక తిష్ఠవేయడమే దీనికి కారణమని తెలుస్తోంది. చైనా ఆర్మీ నియంత్రణలో, సుమారు 400 మంది సిబ్బందితో ఈ నౌక ఇండోనేషియాలోని బాలి తీరంలో ఉన్నట్లు భారత నౌకాదళం వెల్లడించింది. ఈ నౌక కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.
యువాన్ వాంగ్-6 గా వ్యవహరిస్తున్న ఈ చైనా నౌకలో భారీ యాంటెన్నాతో పాటు అత్యాధునిక నిఘా పరికరాలు అమర్చి ఉన్నాయని భారత నౌకాదళ అధికారులు తెలిపారు. వీటితో ఉపగ్రహ ప్రయోగాలను, క్షిపణి ప్రయోగాలు, అవి ప్రయాణించే మార్గాలను ట్రాక్ చేసే వీలుకలుగుతుందని పేర్కొన్నారు. గతంలో శ్రీలంకలోని హంబన్ టోట పోర్టుకు చైనా తన నిఘా నౌకను పంపించిన విషయం తెలిసిందే! దీనిపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా నౌకకు అనుమతివ్వొద్దంటూ భారత్ సూచించినా.. శ్రీలంక పట్టించుకోకుండా అనుమతిచ్చింది.
నవంబర్ 10-11 తేదీలలో బంగాళాఖాతంలో క్షిపణి ప్రయోగం చేపట్టనున్నట్లు భారత ప్రభుత్వం గతంలోనే సరిహద్దు దేశాలకు నోటీసులు (నోటమ్) జారీ చేసింది. ఆ రోజుల్లో బంగాళాఖాతంపై నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని సూచించింది. అగ్ని సిరీస్ లో భాగంగా ఈ క్షిపణి ప్రయోగం చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే చైనా నిఘా నౌక బాలి తీరంలో తిష్ఠ వేయడంతో క్షిపణి ప్రయోగం కొనసాగింపుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.