TSRTC: ఐదు ఆలయాల సందర్శనకు టీఎస్ ఆర్టీసీ ప్యాకేజీ.. వివరాలివిగో!
- సికింద్రాబాద్ లో ఉదయం 7 గంటలకు ప్రారంభం
- పెద్దలకు రూ.500, పిల్లలకు రూ.300
- భోజన ఖర్చు భక్తులే భరించాలి
పవిత్రమైన కార్తీక మాసంలో శివాలయాల దర్శనకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. భక్తుల కోసం తక్కువ ఖర్చుతో ఐదు ఆలయాల సందర్శనకు వీలు కల్పించేలా ఈ ప్యాకేజీని రూపొందించినట్లు పేర్కొంది. కార్తీక మాస దర్శిని ప్యాకేజీ-2 పేరుతో తీసుకొచ్చిన ఈ ప్యాకేజీలో అలియాబాద్, వర్గల్, కొమురవెల్లి, కీసర, చేర్యాల ఆలయాలను దర్శించుకోవచ్చని తెలిపింది. ఈ ప్యాకేజీ కింద పెద్దలకు రూ.500, పిల్లలకు రూ.300 వసూలు చేయనున్నట్లు వెల్లడించింది.
సికింద్రాబాద్ గురుద్వారా వద్ద ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ యాత్ర.. తిరిగి రాత్రికి సికింద్రాబాద్ లోనే ముగుస్తుంది. పికప్ పాయింట్ వద్దే డ్రాపింగ్ ఉంటుంది. ఆలయాల సందర్శనకు టికెట్లు, భోజన ఖర్చు ప్రయాణికులే చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం రాత్రివేళల్లో కూడా బస్సు సర్వీసులు నడిపిస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. శ్రీశైలం ఘాట్ రోడ్ లో రాత్రి వేళల్లో బస్సులకు అనుమతిలేదు. రాత్రివేళల్లో చేరుకునే బస్సులను మున్ననూర్, దోమల పెంట చెక్ పోస్టుల వద్ద నిలిపేసేవారు. అయితే, రాత్రిపూట కూడా బస్సులను అనుమతించాలని ఆర్టీసీ అధికారులు కోరడంతో అటవీ అధికారులు అంగీకరించారు. ప్రస్తుతం ఈ నెల 20 వరకు అనుమతిచ్చారు.