compact electric vehicle: 16న విడుదల అవుతున్న బుల్లి ఎలక్ట్రిక్ కారు
- ఈజ్ -ఈ పేరుతో సూక్ష్మ ఎలక్ట్రిక్ కారు
- ధర మాత్రం రూ.4-5 లక్షల స్థాయిలో
- వ్యక్తిగత రవాణా వాహనంగా తీసుకొస్తున్న ముంబై కంపెనీ
టాటా నానో కారు గుర్తుందా..? ‘చిన్న కారు, చౌక కారు’ పేరుతో వచ్చి కనుమరుగైపోయింది. ఇప్పుడు నానో కంటే చిన్న కారు వస్తోంది. కాకపోతే ఎలక్ట్రిక్ రూపంలో. ముంబైకి చెందిన పీఎంవీ ఎలక్ట్రిక్ ఈ నెల 16న మైక్రో ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. దీనికి ఈఏఎస్-ఈ (ఈజ్- ఈ) అని పేరు పెట్టింది. ప్రతి రోజూ ఉపయోగించుకోతగ్గ కారుగా దీన్ని అభివర్ణించింది.
పీఎంవీ ఎలక్ట్రిక్ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ కారు ఇది. దీని ధర రూ.4-5 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ బుల్లి ఎలక్ట్రిక్ (మైక్రో ఎలక్ట్రిక్) కారు ప్రొటో టైప్ సిద్ధమైందని, త్వరలోనే ఉత్పత్తి మొదలు పెట్టాల్సి ఉందని పీఎంవీ ఎలక్ట్రిక్ తెలిపింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తాము ఈ కారును అభివృద్ధి చేశామని పీఎంవీ ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు కల్పిత్ పటేల్ తెలిపారు. పర్సనల్ మొబిలిటీ (వ్యక్తిగత రవాణా) పేరిట ఓ కొత్త విభాగాన్ని పరిచయం చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈజ్-ఈ కారు ఒక్కసారి చార్జ్ చేస్తే 120-200 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చు. నాలుగు గంటల్లో బ్యాటరీ చార్జ్ అవుతుంది.