president: సిక్కింలో స్టేజీపై రాష్ట్రపతి నృత్యం
- కాలు కదిపిన ముఖ్యమంత్రి భార్య కృష్ణా రాయ్
- సిక్కింలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- ఉత్తర భారతంలో అందమైన రాష్ట్రమని మెచ్చుకోలు
ఉత్తర భారతదేశంలోని అత్యంత సుందరమైన రాష్ట్రాల్లో సిక్కిం ఒకటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి శుక్రవారం గ్యాంగ్ టక్ చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ గంగా ప్రసాద్ ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం భార్యతో కలిసి రాష్ట్రపతి ముర్ము స్టేజిపై నృత్యం చేశారు. అనంతరం ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. అత్యంత సుందరమైన రాష్ట్రాలలో సిక్కిం ఒకటని చెప్పారు. మంచుతో నిండిన శిఖరాలు, అడవులతో వివిధ వర్గాల సంస్కృతులతో గొప్ప వారసత్వ సంపదను సిక్కిం కలిగి ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గ్యాంగ్ టక్ లో ‘సమైక్య నృత్యం’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ భార్య కృష్ణా రాయ్ తో కలిసి రాష్ట్రపతి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వేదికపై స్థానిక కళాకారుల బృందం నృత్యం చేస్తుండగా.. కృష్ణా రాయ్ తో కలిసి రాష్ట్రపతి ముర్ము కాలుకదిపారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.