Ippatam: ఇప్పటంలో ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు: మంత్రి జోగి రమేశ్

Ap minister jogi ramesh response on ippatam tensions

  • ఇప్పటంలో ఉద్రిక్తతలపై మంత్రి వివరణ
  • పవన్ కల్యాణ్ వి పనికిమాలిన చేష్టలని కామెంట్
  • కూల్చివేతల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని మండిపాటు

ఇప్పటంలో జనసేన నేతల ఇండ్ల కూల్చివేతలంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేశ్ వివరణ ఇచ్చారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటంలో ఏం జరిగిందనే దానిపై వివరణ ఇచ్చారు. ఇప్పటంలో ఒక్క ఇల్లు కూడా కూల్చలేదని, అభివృద్ధి పనుల కోసం ప్రహారీలు మాత్రమే కూల్చారని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జససేన చీఫ్ పవన్ కల్యాణ్ లపై మంత్రి ఎదురుదాడి చేశారు. ఇప్పటం వెళ్లి ప్రజలను రెచ్చగొట్టాలనేదే పవన్ కల్యాణ్ పర్యటన ఉద్దేశమని ఆరోపించారు.

పవన్ వ్యాఖ్యలు వింటుంటే ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లు ఉందని మంత్రి విమర్శించారు. గాజువాక, భీమవరం.. రెండుచోట్ల నిలబడితే ఒక్క చోట కూడా గెలవలేని, ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిపించుకోలేని అసమర్థుడని ఎద్దేవా చేశారు. అభివృద్ధి పనులను అడ్డుకోవడం తప్ప పవన్ కు మరో పనిలేదని మంత్రి ఆరోపించారు. ఇప్పటంలో పనులు ఆపకపోతే ఇడుపుల పాయ మీదుగా హైవే నిర్మిస్తామని పవన్ చేసిన వ్యాఖ్యలనూ మంత్రి ఎగతాళి చేశారు.

పవన్ కు మద్ధతుగా చంద్రబాబు తయారయ్యారని మంత్రి జోగి రమేశ్ విమర్శలు గుప్పించారు. కూల్చివేతల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేనేలేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పుష్కరాలు వచ్చినపుడు ఎన్ని వందల ఇళ్లను కూల్చి, ఆ కుటుంబాలను రోడ్డుపాలు చేశారని చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు. 

ఇబ్రహీంపట్నంలో గాంధీ గారి విగ్రహాన్ని అర్ధరాత్రి పూట తొలగించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. వీటన్నిటికీ బదులుగా ప్రజలంతా చంద్రబాబును ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని ఒక్క ఇంచు కూడా కదల్చలేరని మంత్రి జోగి రమేశ్ అన్నారు. జగన్ సర్కారు ప్రజల గుండెల్లో ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News