Andhra Pradesh: తిరుమల వెంకన్న ఆస్తులెంతో తెలుసా?... ఇదిగో టీటీడీ శ్వేతపత్రం!
- టీటీడీ నిధులను దుర్వినియోగం చేస్తున్నారంటూ విపక్షాల విమర్శలు
- విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడీ
- జాతీయ బ్యాంకుల్లో స్వామి వారి నగదు డిపాజిట్లు రూ.15,938 కోట్లుగా వెల్లడి
- 10,258.37 కిలోల స్వామి వారి బంగారం బ్యాంకుల్లో ఉన్నట్లు వివరణ
- జాతీయ బ్యాంకుల్లోనే స్వామి వారి నగదు, నగలు డిపాజిట్ చేస్తున్నట్లు స్పష్టీకరణ
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆస్తులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో లెక్కలేనన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ... స్వామి వారి ఆస్తుల్లో ఇసుమంత కూడా తరుగుదల కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా స్వామి వారికి ఉన్న స్థిరాస్తులను పక్కనపెడితే... ఆయా బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తాలు ఏటికేడు పెరుగుతున్నాయి.
తిరుమలలోని స్వామి వారి హుండీ ఆదాయం రికార్డులు బద్దలు కొడుతూ పెద్ద మొత్తాలను నమోదు చేస్తోంది. ఈ దిశగా ప్రస్తుతం ఆయా బ్యాంకుల్లోని స్వామి వారి నగదు, నగలు విలువ ఎంత అన్న విషయంపై టీటీడీ శనివారం ఓ శ్వేతపత్రం విడుదల చేసింది. స్వామి వారికి భక్తులు సమర్పించిన నగదుతో పాటు నగలను టీటీడీ జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీటి విలువ శనివారం నాటికి భారీగా పెరిగింది. ఆయా జాతీయ బ్యాంకుల్లో స్వామి వారి నగదు డిపాజిట్లు రూ.15,938 కోట్లకు చేరాయి. అదే సమయంలో 10,258.37 కిలోల బంగారం నిల్వలు బ్యాంకుల్లో ఉన్నాయి.
టీటీడీ నిధులను ఏపీ ప్రభుత్వం ఇతరత్రా కార్యక్రమాలకు మళ్లిస్తోందంటూ ఇటీవలి కాలంలో విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. విపక్షాల విమర్శలు అసత్యాలంటూ శనివారం టీటీడీ స్వయంగా ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో భాగంగానే ఆయా బ్యాంకుల్లోని స్వామి వారి నగదు, నగల వివరాలపై టీటీడీ శ్వేత పత్రం విడుదల చేసింది. అంతేకాకుండా స్వామి వారి నగలు, నగదును అధిక వడ్దీలు ఇచ్చే జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేస్తున్నామని వెల్లడించింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ బ్యాంకుల్లో స్వామి వారి నగదు, నగలను డిపాజిట్ చేయబోమంటూ ప్రకటించింది.