Pakistan: గుజరాత్‌లో తొలిసారి ఓటు వేయనున్న పాకిస్థాన్ శరణార్థులు
- పాకిస్థాన్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులు
- అహ్మదాబాద్ కలెక్టరేట్ లెక్కల ప్రకారం వెయ్యికి పైగా శరణార్థులకు పౌరసత్వం
- ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్న శరణార్థులు
పాకిస్థాన్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులు తొలిసారి ఇండియాలో ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వీరు ఓటు వేయబోతున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది. పార్టీల భవితవ్యాన్ని తేల్చేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా భారత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పాకిస్థాన్ హిందూ శరణార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
పాకిస్థానీ శరణార్థులు వెయ్యి మందికి పైగానే ఉన్నారు. అహ్మదాబాద్ కలెక్టరేట్ రికార్డుల ప్రకారం 2016 నుంచి 1,032 మంది పాకిస్థానీ హిందువులకు భారత పౌరసత్వం లభించింది. పాక్ లోని హిందువులు తీవ్రమైన వేధింపులకు గురవుతున్నారు. దీంతో, వారు ఇతర దేశాలకు ఆశ్రయం కోసం వెళ్తున్నారు. ఇలాగే కొందరు భారత్ కు ఆశ్రయం కోసం వచ్చారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చే హిందువులు, క్రైస్తవులు, పార్శీ శరణార్థులకు భారత పౌరసత్వాన్ని జారీ చేసే హక్కు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఉంటుంది. గుజారాత్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తాము ఎంతో ఆసక్తిగా ఉన్నామని పాక్ నుంచి వచ్చిన దిలీప్ మహేశ్వరి అనే వ్యక్తి చెప్పారు.