Tsrtc: పదకొండేళ్ల తర్వాత ఆర్టీసీ విశ్రాంత కార్మికులకు సకల జనుల సమ్మె వేతనం
- మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మళ్లీ చర్చ
- శనివారం నిధులు విడుదల చేస్తూ ఆర్టీసీ చైర్మన్ ఉత్తర్వులు
- విశ్రాంత ఉద్యోగుల ఖాతాల్లో త్వరలో జమ
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్న విషయం తెలిసిందే. సమ్మె జరిగిన కాలం 2011 సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 17 వరకు కార్మికులు విధులు బహిష్కరించారు. ఈ కాలాన్ని సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిర్ణయం వెంటనే అమలు కాకపోవడంతో సమ్మె కాలానికి సంబంధించిన వేతనం పొందకుండానే కొంతమంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. ఉద్యోగంలో కొనసాగుతున్న వారు సమ్మె కాలపు వేతనం ఎప్పుడో అందుకోగా.. పదవీ విరమణ చేసిన వారికి మాత్రం ఇప్పటికీ అందలేదు.
సకల జనుల సమ్మె కాలపు వేతనం అందుకోకుండానే 8,053 మంది కార్మికులు పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి సమ్మె కాలపు వేతనం కోసం పోరాడుతూనే ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగ నేతలతో మంత్రులు జరిపిన భేటీలో ఈ సమస్య ప్రస్తావనకు వచ్చింది. మంత్రులు దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో తాజాగా నిర్ణయం వెలువడింది.
పదకొండేళ్ల పోరాటం తర్వాత వారి నిరీక్షణకు తెరపడింది. కార్మికులకు 3 డీఏలతో పాటు పదవీ విరమణ పొందిన కార్మికులకు సమ్మె కాలపు వేతనాన్ని విడుదల చేస్తూ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ శనివారం ఉత్తర్వులు వెలువరించారు. ఇందుకోసం రూ.25 కోట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.