T20 World Cup: ఆస్ట్రేలియాలో రేప్ కేసులో అరెస్టయిన శ్రీలంక క్రికెటర్
- దనుష్క గుణతిలకను అదుపులోకి తీసుకున్న న్యూ సౌత్ వేల్స్ పోలీసులు
- సిడ్నీ సిటీ పోలీస్ స్టేషన్ కు తరలింపు
- అతను లేకుండానే స్వదేశానికి శ్రీలంక జట్టు ప్రయాణం
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో సెమీఫైనల్ చేరలేకపోయిన శ్రీలంక కు మరో షాక్ తగిలింది. ఆ టీమ్ క్రికెటర్ దనుష్క గుణతిలక ఆసీస్ లో అరెస్టయ్యాడు. అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసులు అతడిని అరెస్టు చేసినట్లు జట్టు వర్గాలు ఆదివారం తెలిపాయి. ఈనెల 2న ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై విచారణ అనంతరం గుణతిలకను ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేసి సిడ్నీ సిటీ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిసింది. దాంతో, అతను లేకుండానే శ్రీలంక జట్టు.. ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి ప్రయాణమైంది.
కాగా, శనివారం ఇంగ్లండ్ చేతిలో ఓడిన శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఎడమచేతి వాటం బ్యాటర్ గుణతిలక ప్రపంచ కప్‌లో మొదటి రౌండ్ మ్యాచ్‌లో నమీబియాపై బరిలోకి దిగి డకౌటయ్యాడు. తర్వాత జట్టు సూపర్ 12 స్టేజ్‌కి అర్హత సాధించినప్పటికీ అతను గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. న్యూ సౌత్ వేల్స్ పోలీసులు శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు తమ వెబ్ సైట్ లో పేర్కొన్నారు. కానీ, పేరు వెల్లడించలేదు.