Telangana: ఆరో రౌండ్ కూడా కారుదే... 2,000 దాటిన టీఆర్ఎస్ మెజారిటీ
- ముగిసిన 6వ రౌండ్ ఓట్ల లెక్కింపు
- టీఆర్ఎస్ కు 2,169 ఓట్ల ఆధిక్యం
- ఒక్క 6వ రౌండ్ లోనే టీఆర్ఎస్ కు 600 ఓట్లకు పైగా ఆధిక్యం
మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిప్తోంది. నేటి ఉదయం ప్రారంభమైన మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి 6వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి కాగా... 6వ రౌండ్ పూర్తి అయ్యేసరికి టీఆర్ఎస్ అధిక్యం ఏకంగా 2 వేలకు దాటిపోయింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 2,169 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. 2, 3 రౌండ్లలో మాత్రమే టీఆర్ఎస్ వెనుకబడగా...మిగిలిన 4 రౌండ్లలో టీఆర్ఎస్ దూకుడు కనబరచింది.
మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ లో 6వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేసరికి టీఆర్ఎస్ కు 38,521 ఓట్లు పోలయ్యాయి. అదే సమయంలో బీజేపీకి 36,352 ఓట్లు పోలయ్యాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి స్రవంతికి 11,894 ఓట్లు పోలయ్యాయి. ఒక్క 6వ రౌండ్ లోనే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 600లకు పైగా ఓట్ల ఆధిక్యం లభించింది. ఇదే తీరు ఇలాగే కొనసాగితే.. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ విజయం నల్లేరుపై నడకేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.