Telangana: మునుగోడు ఉప ఎన్నికలో గద్వాల ఏఎస్పీ రాములు నాయక్ పై వేటు

ec suspends gadwal asp ramulu naik and attaches to ts dgp office

  • మునుగోడు ఉప ఎన్నికల భద్రతా విధుల్లో పాల్గొన్న గద్వాల్ ఏఎస్పీ రాములు నాయక్
  • విధి నిర్వహణలో బీజేపీ అభ్యర్థిని కలిసినట్లు ఆరోపణలు
  • ఘటనపై విచారణ చేపట్టి ఆరోపణలు నిజమేనని తేల్చిన ఈసీ
  • ఈసీ ఆదేశాలతో రాములు నాయక్ ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసిన తెలంగాణ సర్కారు

మునుగోడు ఉప ఎన్నికల్లో ఇప్పటికే ఇద్దరు అధికారులపై వేటు పడగా... ఉప ఎన్నికల్లో తుది ఘట్టమైన ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయాన మరో అధికారిపై వేటు పడింది. మునుగోడు ఉప ఎన్నికల భద్రతా విధుల్లో పాలుపంచుకున్న గద్వాల్ అదనపు ఎస్పీ (ఏఎస్పీ) రాములు నాయక్ పై వేటు పడింది. ఈ మేరకు ఓ వైపు ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలోనే రాములు నాయక్ పై వేటు వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

మునుగోడు ఉప ఎన్నికల భద్రతా విధుల్లో ఉన్న రాములు నాయక్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా రాజగోపాల్ రెడ్డిని రాములు నాయక్ కలిసినట్లుగా రుజువైంది. దీంతో రాములు నాయక్ ను సస్పెండ్ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గద్వాల ఏఎస్పీ పోస్టు నుంచి రాములు నాయక్ ను తప్పించిన రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News