TRS: 12వ రౌండ్ తో బీజేపీకి అవకాశమే లేకుండా చేసిన టీఆర్ఎస్... నైతిక విజయం తనదేనంటున్న రాజగోపాల్ రెడ్డి
- కొనసాగుతున్న కౌంటింగ్
- ఇప్పటిదాకా 12 రౌండ్ల లెక్కింపు పూర్తి
- 12వ రౌండ్లో టీఆర్ఎస్ కు 2 వేలకు పైగా ఆధిక్యం
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ లో టీఆర్ఎస్ జోరు ప్రదర్శిస్తోంది. కౌంటింగ్ కొనసాగుతుండగా, 12వ రౌండ్లో టీఆర్ఎస్ కు 2,042 ఓట్ల భారీ అధిక్యం లభించింది. 12వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 7,440, బీజేపీకి 5,398 ఓట్లు లభించాయి. 12 రౌండ్లు ముగిసేసరికి గులాబీ పార్టీ ఆధిక్యం 7,807 ఓట్లకు పెరిగింది. ఇప్పటిదాకా టీఆర్ఎస్ కు 82,005, బీజేపీకి 74,198, కాంగ్రెస్ కు 17,627 ఓట్లు లభించాయి. మరో మూడు రౌండ్ల లెక్కింపు మిగిలుండగా, టీఆర్ఎస్ గెలుపు లాంఛనమేనని తెలుస్తోంది.
కాగా, ఓట్ల లెక్కింపు సరళి తమకు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి నిష్క్రమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీది అధర్మ విజయం అని, మునుగోడులో నైతిక విజయం తనదేనని ఉద్ఘాటించారు.
టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని... అధికారులను కేసీఆర్, కేటీఆర్ ప్రభావితం చేశారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. పోలీస్ వ్యవస్థను టీఆర్ఎస్ పార్టీ సొంత ప్రయోజనాలకు వాడుకుందని ఆరోపించారు. కనీసం తమను ప్రచారం కూడా చేసుకోనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రజాతీర్పును గౌరవిస్తున్నానని స్పష్టం చేశారు.