Cloud Tail India: అమెజాన్ విక్రేత క్లౌడ్ టెయిల్ కు రూ.1 లక్ష జరిమానా

CCPA imposes penalty on Cloud Tail India

  • నాసిరకం కుక్కర్లు విక్రయిస్తోందంటూ సీసీపీఏ చర్యలు
  • అమెజాన్ బేసిక్స్ పేరిట అమ్ముతోందని వెల్లడి
  • వీటిలో విజిల్ రావడంలేదంటున్న సీసీపీఏ

ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ అమెజాన్ వేదికగా వివిధ రకాల ఉత్పత్తులు విక్రయించే క్లౌడ్ టెయిల్ ఇండియా సంస్థ జరిమానాకు గురైంది. బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగాలేని ప్రెషర్ కుక్కర్లను విక్రయిస్తోందంటూ క్లౌడ్ టెయిల్ పై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) చర్యలకు ఉపక్రమించింది. 

క్లౌడ్ టెయిల్ వినియోగదారుల హక్కులను ఉల్లంఘించిందని, అనైతిక విక్రయాలకు పాల్పడుతోందని సీసీపీఏ పేర్కొంది. ఈ మేరకు సదరు విక్రయ సంస్థకు రూ.1 లక్ష జరిమానా విధిస్తున్నట్టు వెల్లడించింది. 

క్లౌడ్ టెయిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 'అమెజాన్ బేసిక్స్ స్టెయిన్ లెస్ స్టీల్ అవుటర్ లిడ్ ప్రెషర్ కుక్కర్ (4 లీటర్లు)' పేరిట కుక్కర్లు విక్రయిస్తోందని, అయితే ఈ కుక్కర్లలో విజిల్ రావడంలేదని సీసీపీఏ వివరించింది. 

కాగా, క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (క్యూసీవో) చర్యల తర్వాత ఈ కుక్కర్ల దిగుమతిని నిలిపివేసినట్టు క్లౌడ్ టెయిల్ సంస్థ సీసీపీఏకి తెలియజేసింది. దీనిపై సీసీపీఏ స్పందిస్తూ, ఆ కుక్కర్ల దిగుమతిని నిలిపివేసినట్టు చెబుతున్న క్లౌడ్ టెయిల్, ఈ-కామర్స్ పోర్టళ్లలో వాటి విక్రయాలను మాత్రం నిలిపివేయలేదని వెల్లడించింది. 

ఈ క్రమంలో ప్రమాణాలకు అనుగుణంగా లేని ప్రెషర్ కుక్కర్ల అమ్మకాలకు వేదికలుగా నిలుస్తున్నాయంటూ అమెజాన్, ఫ్లిప్ కార్ట్, పేటీఎం మాల్, షాప్ క్లూస్, స్నాప్ డీల్ వంటి ఈ-కామర్స్ పోర్టళ్లకు, ఆయా పోర్టళ్లలో అమ్మకాలు సాగించే సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News