Tanzania: టాంజానియా విమాన ప్రమాదంలో.. 19 మంది మృత్యువాత
- విక్టోరియా సరస్సులో కూలిన చిన్న విమానం
- సిబ్బందితో కలిపి 43 మంది ప్రయాణికులు
- 24 మందిని కాపాడిన రెస్క్యూ బృందాలు
టాంజానియాలో ఆదివారం జరిగిన ప్రమాదంలో 19 మంది చనిపోయారని ఆ దేశ ప్రధాని సోమవారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు దేశ ప్రజలందరి తరఫున ఆయన సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రధాని కాసిం మజాలివా పేర్కొన్నారు. ఆదివారం 43 మందితో వెళుతున్న చిన్న విమానం విక్టోరియా సరస్సులో కూలిన సంగతి తెలిసిందే!
ఈ ప్రమాదంలో విమానంతో పాటు సరస్సులో పడిన 26 మంది ప్రయాణికులను కాపాడినట్లు ఆదివారం వార్తలు ప్రసారమయ్యాయి. అయితే, రెస్య్కూ బృందాలు కాపాడిన వాళ్లలో 24 మంది మాత్రమే తమ ప్రయాణికులని, మిగతా ఇద్దరు ప్రయాణికులు కాదని ఆ విమానయాన సంస్థ అధికారి ఒకరు వెల్లడించారు.
ప్రెసిషన్ ఎయిర్ ట్రావెల్ కంపెనీకి చెందిన చిన్న విమానం ఒకటి ఆదివారం దార్ ఎ సలామ్ నుంచి బుకోబా పట్టణానికి బయల్దేరింది. ఇందులో ఓ పసికందుతో పాటు 39 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ప్రయాణిస్తున్నారు. సాంకేతికలోపం వల్ల విమానం విక్టోరియా సరస్సులో కూలింది. ఆ చుట్టుపక్కల ఉన్న జనం వెంటనే స్పందించి చాలామంది ప్రయాణికులను కాపాడారు. దురదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు