Team India: మరో రికార్డును బ్రేక్ చేసిన ప్రపంచ నం.1 బ్యాటర్ సూర్యకుమార్
- ఒక ఏడాదిలో వెయ్యి టీ20 రన్స్ చేసిన తొలి భారతీయుడిగా ఘనత
- ఓవరాల్ గా పాక్ బ్యాటర్ రిజ్వాన్ తర్వాత ఈ రికార్డు సాధించిన రెండో క్రికెటర్
- టీ20 ప్రపంచ కప్ లో చెలరేగిపోతున్న సూర్యకుమార్
ఆలస్యంగా భారత జట్టులోకి వచ్చి అద్భుత ఆటతో చెలరేగిపోతున్న ఆటగాడు సూర్యకుమార్ యాదవ్. ముఖ్యంగా టీ20 ఫార్మాట్ లో అతనికి ఎదురేలేకుండా పోయింది. వైవిధ్యమైన షాట్లతో గ్రౌండ్ నలుమూలలా షాట్లు కొడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో అతని బ్యాటింగ్ విన్యాసాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లోనూ కళ్లు చెదిరే షాట్లతో మెరుపు అర్ధ శతకం సాధించి భారత్ కు ఘన విజయం కట్టబెట్టాడు.
ఇప్పటికే టీ20ల్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ గా నిలిచిన సూర్యకుమార్ తాజా ప్రదర్శనతో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది టీ20 ఫార్మాట్ లో సూర్య వెయ్యి పరుగులు చేశాడు. దాంతో, ఒక క్యాలెండర్ ఇయర్ లో 1000 రన్స్ చేసిన భారత తొలి క్రికెటర్ గా రికార్డుకెక్కాడు. ఓవరాల్ గా ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్ అయ్యాడు. పాకిస్థాన్ కు చెందిన మహ్మద్ రిజ్వాన్ మొదటి స్థానంలో ఉన్నాడు.
ఈ ఏడాది ఇప్పటిదాకా ఆడిన 28 టీ20 ఇన్నింగ్స్ ల్లో సూర్య కుమార్ 44.60 సగటుతో 1026 పరుగులు చేశాడు. 2021లో పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 73.66 సగటుతో 1326 పరుగులు చేశాడు. గతేడాది రిజ్వాన్ ఇన్ని పరుగులు చేసేందుకు 983 బంతులు తీసుకున్నాడు. కానీ, సూర్యకుమార్ కేవలం 550 బంతుల్లోనే 1026 పరుగులు చేయడం విశేషం.