T20 World Cup: లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన లంక క్రికెటర్ పై సస్పెన్షన్ వేటు
- అన్ని ఫార్మాట్ల నుంచి తప్పిస్తున్నట్టు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటన
- నేరం రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ
- టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లి అరెస్టయిన గుణతిలక
టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లి, లైంగిక వేధింపుల కేసులో సిడ్నీలో అరెస్టయిన శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలకపై సస్పెన్షన్ వేటు పడింది. అతడిని అన్ని రకాల క్రికెట్ నుంచి సస్పెండ్ చేసినట్టు శ్రీలంక క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. అతనిపై వచ్చిన నేరారోపణలపై విచారణను కూడా ప్రారంభిస్తామని, నేరం రుజువైతే కఠినంగా శిక్షిస్తామని తెలిపింది. ఇలాంటి విషయాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. కేసు దర్యాప్తులో ఆస్ట్రేలియా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అవసరమైన సహాయం చేస్తామని తెలిపింది.
మరోవైపు ఈ కేసులో బెయిల్ కోసం సోమవారం సిడ్నీ కోర్టులో గుణతిలక వీడియో లింక్ ద్వారా హాజరయ్యాడు. ఈ సమయంలో అతని చేతికి సంకెళ్లు ఉన్నాయి. సిడ్నీలో 29 ఏళ్ల మహిళతో సమ్మతి లేకుండా లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు గుణతిలకపై నాలుగు ఆరోపణలు వచ్చాయి. డేటింగ్ యాప్‌లో చాలా రోజులుగా మాట్లాడుకున్న తర్వాత గత బుధవారం సాయంత్రం సదరు మహిళపై క్రికెటర్ లైంగిక దాడికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.