TDP: మహిళా కలెక్టర్ పై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం... పేపర్లను టేబుల్ పై విసిరేసిన వైనం

tdp leader jc prabhakar reddy fires over ananthapur collector and throws papers on her table
  • అనంతపురం కలెక్టరేట్ లో స్పందనకు హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి
  • సజ్జలదిన్నె భూ ఆక్రమణలపై కలెక్టర్ నాగలక్ష్మికి ఫిర్యాదు  
  • ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోరా? అంటూ మండిపాటు
  • కలెక్టర్ సెక్యూరిటీ గార్డును నెట్టివేసేందుకు యత్నించిన టీడీపీ నేత
  • ప్రజాప్రతినిధులనే గో అంటూ అవమానిస్తారా? అంటూ నిరసన
టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్ పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం హల్ చల్ చేశారు. జిల్లా కలెక్టర్ గా ఉన్న నాగలక్ష్మిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన చేతిలోని ఫిర్యాదు పత్రాలను ఆయన కలెక్టర్ ముందు టేబుల్ పై విసిరికొట్టారు. ఈ సందర్భంగా తనను నిలువరించేందుకు వచ్చిన కలెక్టర్ సెక్యూరిటీ గార్డును ఆయన తోసివేసే యత్నం చేశారు. కలెక్టర్ తో పాటు ఆమె పక్కనే కూర్చుని ఉన్న జాయింట్ కలెక్టర్ తో ఆయన వాగ్వాదానికి దిగారు. వెరసి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యాక్రమంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ఈ ఘటన పూర్తి వివరాల్లోకెళితే... తాడిపత్రి మండలం సజ్జలదిన్నెలో ప్రభుత్వానికి చెందిన రూ.70 కోట్ల విలువ చేసే 7 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందంటూ గత కొంతకాలంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ భూమిని కాపాడాలంటూ ఆయన ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో సోమవారం ఆయన కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి స్వయంగా హాజరయ్యారు. 

ఈ భూవివాదంపై సమగ్ర వివరాలను సేకరించి ఆ పత్రాలను కలెక్టర్ కు అందించే యత్నం చేశారు. కలెక్టర్ ముందుకు వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి... ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ ఆయన నాగలక్ష్మిని నిలదీశారు. మీ ఫిర్యాదును పరిశీలిస్తామని, ఇక మీరు వెళ్లండి అంటూ కలెక్టర్ చెప్పడంతో జేసీ ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

స్పందన కార్యక్రమం అంటే ఏమిటో మీకు తెలుసా? అంటూ ఆయన నాగలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదుదారులు చెప్పే వివరాలను వినే ఓపిక లేనప్పుడు ఇక స్పందన కార్యక్రమం నిర్వహించడం ఎందుకు? అని నిలదీశారు. తాను మాజీ ఎమ్మెల్యేనని, ప్రస్తుతం తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ గా కొనసాగుతున్నానని... తననే గో అంటూ వెళ్లగొడితే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటంటూ ఆయన స్వరం పెంచారు. 

ఈ సందర్భంగా ఇవిగో ఆ భూ ఆక్రమణకు చెందిన పత్రాలు అంటూ ఆయన తన చేతిలోని పత్రాలను కలెక్టర్ ముందు టేబుల్ పై విసిరికొట్టారు. ఆ పత్రాలను చేతిలోకి తీసుకున్న కలెక్టర్ పరిశీలిస్తామని చెప్పినా ఆయన అక్కడి నుంచి కదల్లేదు. ఈ సమయంలోనే జేసీని నిలువరించేందుకు కలెక్టర్ సెక్యూరిటీ గార్డు ముందుకు రాగా... అతనిని జేసీ నెట్టివేసే యత్నం చేశారు. దీంతోమ సెక్యూరిటీ గార్డు కూడా చూస్తూ నిలబడిపోయారు.

కాసేపు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లతో వాదన సాగించిన జేసీ... ఆ తర్వాత కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్బంగా అక్కడే మీడియాతో మాట్లాడిన ప్రభాకర్ రెడ్డి... ఐఏఎస్ అధికారుల విధులు ఏమిటో కూడా ఈ కలెక్టర్ కు తెలిసినట్లు లేవని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యేను అయిన తననే కలెక్టర్ గో అంటూ బయటకు వెళ్లగొడతారా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళలకు గౌరవం ఇస్తామని, అలా అని కలెక్టర్ హోదాలో ఉంటూ ప్రజా సమస్యలపై స్పందించకుంటే మాత్రం సహించేది లేదన్నారు. ఓ ఐఏఎస్ అధికారిణిగానే కలెక్టర్ కు తాను గౌరవం ఇస్తున్నానని తెలిపారు. ప్రజా ప్రతినిధులనే పట్టుకుని గో అంటారా? అంటూ ఆయన మండిపడ్డారు. రూ.70 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతూ ఉంటే చోద్యం చూస్తారా? అని నిలదీశారు. తాను అందించిన ఫిర్యాదులో భూ దురాక్రమణకు చెందిన అన్ని వివరాలు ఉన్నాయని, దమ్ముంటే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
TDP
JC Prabhakar Reddy
Anantapur District
Spandana
Tadipatri

More Telugu News