Rahul Gandhi: 'గిఫ్ట్ లేదా సీతక్కా' అని అడగడమే ఆలస్యం... రాహుల్ కు రూ.20 వేల ఖరీదు చేసే షూ ఇచ్చిన ఎమ్మెల్యే
- ఎమ్మెల్యే సీతక్కతో ఆత్మీయంగా సాగుతున్న రాహుల్ గాంధీ
- నాకేం గిఫ్ట్ ఇస్తున్నావంటూ సీతక్కను అడిగిన రాహుల్
- రూ.20 వేల ఖరీదు చేసే షూను బహూకరించిన సీతక్క
- సీతక్క నక్సల్బరీపైనా రాహుల్ మాటామంతీ
భారత్ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సోమవారం తెలంగాణకు వీడ్కోలు చెబుతూ మహారాష్ట్రలో అడుగుపెట్టబోతున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ, ములుగు ఎమ్మెల్యే సీతక్క మధ్య జరిగిన ఓ సంభాషణ, తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీకి సీతక్క ఇచ్చిన బహుమతి ఆసక్తికరంగా మారింది.
రాహుల్ పాదయాత్రలో సీతక్క యాక్టివ్ గా పాలుపంచుకుంటున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోనే కాకుండా తమిళనాడులో జరిగిన రాహుల్ పాదయాత్రకు కూడా సీతక్క హాజరైన సంగతి తెలిసిందే. సీతక్క ఎక్కడ కనిపించినా ఓ సొంత సోదరిలా ఆమె భుజం మీద చేయి వేసి మరీ ఆప్యాయతను కనబరుస్తున్న రాహుల్... తన పాదయాత్రలోనూ సీతక్కతో ఆయన అంతే అత్మీయతతో మెలగుతున్నారు.
పాదయాత్ర హైదరాబాద్ దాటి సంగారెడ్ది జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఓ రోజు గిరిజనులతో కలిసి రాహుల్ డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానూ ఆయన సీతక్కతో కలిసి గిరిజన నృత్యం చేశారు. ఈ సందర్భంగా 'మీ రాష్ట్రానికి వచ్చిన ఈ సోదరుడికి గిఫ్ట్ లేదా సీతక్కా?' అని రాహుల్ అడిగారట. ఈ మాట విన్నంతనే 'మీరు అడగడమే మహా భాగ్యం' అన్నట్టుగా వ్యవహరించిన సీతక్క... రాహుల్ సెక్యూరిటీ సిబ్బంది వద్దకెళ్లి...రాహుల్ షూ సైజు, ఆయన వాడే షూ కంపెనీ బ్రాండ్ గురించి తెలుసుకుని... ఆ మరునాటికే రాహుల్ కు షూ బహూకరించారట.
ఈ షూ చూసి ముచ్చటపడ్డ రాహుల్... తన సోదరి తనకు గిఫ్ట్ ఇచ్చిందని పొంగిపోయారట. ఇదే విషయాన్ని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ కు చెప్పుకుని మరీ ఆయన సంబరపడిపోయారట. రాహుల్ గాంధీకి షూ బహూకరించేందుకు సీతక్క దాదాపుగా రూ.20 వేలు ఖర్చు చేసినట్లుగా పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే... పూర్వాశ్రమంలో సీతక్క నక్సలైట్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని సీతక్క వద్ద రాహుల్ గాంధీ ప్రస్తావించారట. గన్ ఎక్కడ అక్కా? అంటూ రాహుల్ అడగ్గానే... దానిని అడవిలోనే వదిలిపెట్టి వచ్చానంటూ సీతక్క బదులిచ్చారట. అయితే త్వరలోనే ఢిల్లీకి పిలుస్తానని.. అక్కడ షూటింగ్ లో పోటీ పెడతానని రాహుల్ అన్నారట. గన్ కాల్చడంలో మీ ప్రావీణ్యం ఏపాటిదో తెలుసుకుంటానంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు సీతక్కతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంచి జోష్ ను నింపాయట.