Congress: కేజీఎఫ్-2 పాటల వివాదం... కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేయాలని కోర్టు ఆదేశాలు
- భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ
- కేజీఎఫ్-2 పాటలు వాడుకుంటున్నారని ఎమ్మార్టీ మ్యూజిక్ ఫిర్యాదు
- రాహుల్ గాంధీ, జైరాం రమేశ్, సుప్రియా శ్రీనటేలపై ఆరోపణలు
- కాపీరైట్ నియమావళి ఉల్లంఘనలకు పాల్పడిందన్న కోర్టు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర వీడియోలకు కేజీఎఫ్-2 పాటలను జోడించడం వివాదాస్పదం కావడం తెలిసిందే. రాహుల్ గాంధీ, జైరాం రమేశ్, సుప్రియా శ్రీనటేలపై ఆడియో సంస్థ ఎమ్మార్టీ మ్యూజిక్ బెంగళూరులోని యశ్వంత్ పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేజీఎఫ్-2 పాటలపై సర్వ హక్కులు తమవేనని, తమ అనుమతి లేకుండా పాటలు వాడుకుంటున్నారని ఎమ్మార్టీ సంస్థ నిర్వాహకుడు ఎం.నవీన్ కుమార్ ఆరోపించారు. జైరాం రమేశ్ ట్విట్టర్ లో రెండు వీడియోలను పోస్టు చేశారని తెలిపారు. అందులో కేజీఎఫ్-2 పాటలతో కూడిన వీడియోలు ఉన్నాయని వివరించారు.
ఈ ఫిర్యాదు నేపథ్యంలో... కాపీరైట్ చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసు నమోదైంది. దీనిపై బెంగళూరు కోర్టులో విచారణ జరగ్గా... కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్ తో పాటు, భారత్ జోడో ట్విట్టర్ అకౌంట్ ను కూడా తాత్కాలికంగా నిలిపివేయాలని ట్విట్టర్ యాజమాన్యాన్ని ఆదేశించింది. కాపీరైట్ నియమావళి ఉల్లంఘనలకు పాల్పడినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.