Excessive drinking: యువతులు అతిగా మద్యం తాగడమే సంక్షోభానికి కారణం: పోలండ్ నేత
- జననాల రేటు తగ్గడానికి కారణం ఇదేనన్న కజిన్ స్కీ
- కేవలం రెండేళ్లలోనే మద్యానికి బానిసలుగా మారుతున్నట్టు వ్యాఖ్య
- ఓ వైద్యుడి అనుభవం ఆధారంగా చెబుతున్నానంటూ సమర్థన
పోలండ్ కు చెందిన అధికార పార్టీ ముఖ్యనేత జరోస్లా కజిన్ స్కీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలండ్ లో మెజారిటీ యువ మహిళలు అతిగా మద్యం సేవించడమే దేశంలో జననాల రేటు తక్కువగా ఉండడానికి కారణమని వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాఖ్యలు పితృస్వామ్యానికి నిదర్శనంగా పలువురు రాజకీయ నేతలు, సెలబ్రిటీలు వ్యాఖ్యానిస్తున్నారు.
‘‘25 ఏళ్ల వయసు వచ్చే వరకు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో గమనిస్తే.. యువ మహిళలు తమ వయసు వారైన పురుషులతో సమానంగా మద్యాన్ని సేవిస్తున్నారు. అందుకే పిల్లలు కలగడం లేదు’’ అని కజిన్ స్కీ వ్యాఖ్యానించారు. పురుషుడు మద్యానికి బానిసగా మారాలంటే అధికంగా 20 ఏళ్ల పాటు సేవించాల్సి ఉంటే.. మహిళలకు కేవలం రెండేళ్లు చాలని కూడా అన్నారు. అయితే, తన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు.
ఓ డాక్టర్ అనుభవం ఆధారంగా చెబుతున్నవిగా వీటిని ఆయన పేర్కొన్నారు. ఓ డాక్టర్ తన పురుష ఆల్కహాల్ బాధిత రోగుల్లో మూడింట ఒక వంతు మందిని సరిదిద్దగా.. మహిళల్లో ఒక్కరినీ బాగుచేయలేకపోయినట్టు చెప్పారు. పోలండ్ లో ఓ మహిళ సగటు జనన రేటు 1.3 కు తగ్గిపోవడం అక్కడ ఆందోళన కలిగిస్తోంది.